పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి కేసులో సుప్రీం తీర్పు
- పెళ్లికి ముందు మేజర్లు ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే తప్పుకాదన్న కోర్టు
- మారుతున్న కాలంలో ఇది సాధారణమైందన్న అత్యున్నత న్యాయస్థానం
- దీని ఆధారంగా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమన్న కోర్టు
- ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశం
తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2014లో అతనిపై ఓ యువతి క్రిమినల్ కేసు పెట్టింది. ఆ తర్వాత 2015లో లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు రాజీకొచ్చాయి. ఈ పాత కేసును కారణం చూపిస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అతని ఉద్యోగాన్ని రద్దు చేసింది. దీనిపై సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. పోలీసు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పెళ్లికి ముందే ప్రేమించుకోవడం, శారీరక సంబంధాలు కలిగి ఉండటం సాధారణంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నంత మాత్రాన, ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోలేదనే ఒకే ఒక్క కారణంతో ఒకరు మరొకరిని మోసం చేశారని అనుకోలేమని స్పష్టం చేసింది. ప్రతి ప్రేమకథా పెళ్లితోనే ముగియాలని నియమం ఏమీ లేదని ధర్మాసనం పేర్కొంది.
లోక్ అదాలత్‌లో కేసు రాజీపడినంత మాత్రాన అభ్యర్థి తన తప్పును ఒప్పుకొన్నట్లు కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. బాధితురాలే స్వయంగా కేసును వెనక్కి తీసుకుని రాజీపడినప్పుడు.. సదరు అభ్యర్థి క్యారెక్టర్ బాలేదంటూ ఉద్యోగానికి అనర్హుడిని చేయడానికి పోలీస్ బోర్డుకు ఎలాంటి హక్కు లేదని తేల్చిచెప్పింది. కేవలం విఫలమైన ప్రేమ బంధాన్ని సాకుగా చూపి ఉద్యోగం నిరాకరించడం పూర్తిగా అన్యాయమని కోర్టు పేర్కొంది.
చివరికి సుప్రీంకోర్టు తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన రద్దు ఉత్తర్వులను పూర్తిగా కొట్టివేసింది. సదరు అభ్యర్థిని వెంటనే విధుల్లోకి తీసుకుని, తదుపరి బ్యాచ్ కానిస్టేబుళ్లతో పాటు శిక్షణకు పంపాలని ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.