పరీక్షలంటే తెలియని వారు కూడా బురద జల్లుతున్నారు: సీఎం చంద్రబాబు
- పశ్చిమగోదావరి జిల్లాలో ‘మీ భూమి - మీ హక్కు’ కార్యక్రమం
- హాజరైన సీఎం చంద్రబాబు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ
- భద్రతా ఫీచర్లతో రాజముద్ర వేసి కొత్త పాస్‌బుక్కులు ఇస్తున్నామని వెల్లడి
- రికార్డులు ఫోర్జరీ చేసిన ఎమ్మెల్యేపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ ప్రశ్న
- గొడ్డలి పార్టీకి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదంటూ ఫైర్
- ఆక్వా రైతులకు అండగా ఉంటాం.. కేంద్రంతో మాట్లాడుతున్నామని భరోసా
గత పాలకులు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను దగా చేశారని, తాము అధికారంలోకి వచ్చాక దాదాపు 16 వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఏం చెప్పాలో తెలియక నేరాలు చేసి, ఎదుటివారిపై దుష్ప్రచారం చేయడమే ‘గొడ్డలి పార్టీ’ పనిగా పెట్టుకుందని విమర్శించారు. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలి పట్టే రైతులు గుర్తుకురారని, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లకు వరికోతలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు.
భూ రికార్డుల ప్రక్షాళన.. రాజముద్రతో పాస్‌పుస్తకాలు
భూ వివాదాలకు తావులేని గోదావరి జిల్లాల్లో గత పాలకులు చిచ్చుపెట్టి రికార్డులు తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ఓ నల్ల చట్టం తెచ్చి ప్రజల భూములను కాజేయాలని చూశారని, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన రికార్డులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేశారని అన్నారు. "మేం అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కుల్ని కాపాడాం. భూమి మీది, కానీ ఫొటోలు వారివి ముద్రించుకున్నారు. పొలం సరిహద్దు రాళ్లపై కూడా వారి బొమ్మలు వేసుకున్నారు" అని విమర్శించారు.
ఈ సమస్యల పరిష్కారానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి పటిష్టమైన చర్యలతో, కరెన్సీ నోట్ల తరహా భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 26.46 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేశామని, నిర్దేశిత గడువులోగా మొత్తం 90 లక్షల పుస్తకాలను రైతులకు అందజేస్తామని తెలిపారు. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తెచ్చి, 1.37 లక్షల ఎకరాల సర్వీస్ ఇనామ్ భూములను 22ఏ నుంచి తప్పించామని పేర్కొన్నారు.
రెండేళ్ల పాలన.. అభివృద్ధి, సంక్షేమం
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చంద్రబాబు తెలిపారు. ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మూడు ప్రాంతాల్లో సభలు పెడుతున్నామన్నారు.
"అభివృద్ధిని తిరిగి ట్రాక్‌లో పెట్టాం. అందుకే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. సంక్షేమంలో దేశంలో ఎవరూ చేయలేని విధంగా ప్రజలకు మేలు చేస్తున్నాం. సూపర్ సిక్స్‌లో చెప్పిన వాటికంటే అదనంగానే ఇచ్చాం" అని అన్నారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం వాటాతో కలిపి రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తున్నామని చెప్పారు.
గోదావరి జిల్లాలకు పెద్దపీట
దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఉన్న గోదావరి జిల్లాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు పడిన ఇబ్బందులను గుర్తుచేస్తూ, తాము 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని, ఫీడ్ ధరల పెరుగుదల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
గొడ్డలి పార్టీకి రాజకీయాలు చేసే అర్హత లేదు
తెలంగాణలో ఎమ్మార్వో, జేసీ సంతకాలు ఫోర్జరీ చేసి రూ.1500 కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన వినుకొండ మాజీ ఎమ్మెల్యేను వైసీపీ అధ్యక్షుడు ఎందుకు సస్పెండ్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత ‘గొడ్డలి పార్టీ’కి లేదని, వారు రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే గంజాయి బ్యాచ్‌లను, గొడ్డలి పార్టీ వ్యక్తులను ప్రజలు దూరంగా పెట్టాలని పిలుపునిచ్చారు.