'సమరసింహారెడ్డి'లోని ఫేమస్ సీన్‌కు పరిటాల రవి మాట స్ఫూర్తి: అసలు విషయం చెప్పిన పరుచూరి
- పరిటాల రవి చెప్పిన ఓ మాటనే 'సమరసింహారెడ్డి'లో డైలాగ్‌గా వాడానన్న పరుచూరి గోపాలకృష్ణ
- శత్రువులు మిత్రుడి రూపంలోనూ వస్తారని రవి అన్నారని.. అదే స్ఫూర్తిగా నిలిచిందని వెల్లడి
- శ్రీరాములయ్య సినిమా సమయంలో పరిటాల రవితో జరిగిన సంభాషణలను గుర్తుచేసుకున్న పరుచూరి
పరిటాల రవి తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'శ్రీరాములయ్య' సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. ఈ సినిమా చర్చల సందర్భంగా పరిటాల రవిని కలిసినప్పుడు జరిగిన ఓ సంఘటనను పరుచూరి వివరించారు. "శ్రీరాములయ్య సినిమా డిస్కషన్స్‌లో ఉన్నప్పుడు, మా రెండో అన్నయ్య పంపిన ప్రసాదాన్ని నేను పరిటాల రవికి ఇచ్చాను. దాన్ని తినబోతూ ఆయన ఒక్క క్షణం ఆగి, 'అన్నా, ఇదెవరు ఇచ్చారు?' అని నన్ను ప్రశ్నించారు. మా అన్నయ్య పంపారని చెప్పాకనే ఆయన దాన్ని స్వీకరించారు. వెంటనే నేను, 'ఎందుకలా అనుమానించారు?' అని అడిగాను" అని పరుచూరి తెలిపారు.
దానికి పరిటాల రవి చెప్పిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందని పరుచూరి అన్నారు. "'అది కాదన్నా... నువ్వు ఇచ్చింది ఏదైనా నేను తింటానని నా శత్రువులకు తెలుసు. అందుకే, వాళ్లు నీ ద్వారానే నాకు హాని తలపెట్టే అవకాశం ఉంది. అందుకే అలా అడగాల్సి వచ్చింది' అని రవి బదులిచ్చారు. శత్రువు మిత్రుడి రూపంలోనూ రావచ్చనే ఆయన ఆలోచన నాకు బాగా నచ్చింది. ఆ మాట నా మదిలో బలంగా నాటుకుపోయింది. వెంటనే ఆ స్ఫూర్తితోనే సమరసింహారెడ్డి సినిమాలో ఒక సన్నివేశాన్ని రాశాను. ఆ సినిమాలో బాలయ్యకు ఏమీ కాకూడదని, ఆయన తినే ప్రతీ పదార్థాన్ని ముందుగా పృథ్వీ తిని పరీక్షించేలా ఆ సన్నివేశాన్ని, డైలాగులను తీర్చిదిద్దాను. పరిటాల రవి చెప్పిన ఆ ఒక్క మాటే ఆ సీన్‌కు ప్రాణం పోసింది" అని పరుచూరి వివరించారు.
బాంబు దాడిలో నేను చనిపోయాననుకున్నారు..
అలాగే, 1997లో రామానాయుడు స్టూడియోలో జరిగిన బాంబు పేలుడు ఘటనను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. "శ్రీరాములయ్య సినిమా ప్రారంభోత్సవం రోజున ఆ బాంబు దాడి జరిగింది. నేను కూడా అక్కడే ఉన్నాను. ఘటన జరిగిన చోట ఒక ఎర్ర శాలువా పడి ఉండటంతో, అది నాదేనని భావించి నేను చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ వార్త తెలిసి మా అమ్మాయి ఇంట్లో కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే నేను ఇంటికి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పరిటాల రవి నన్ను 'భయమేస్తుందా అన్నా?' అని అడిగారు. 'నువ్వు పక్కన ఉండగా నాకెందుకు భయం' అని నేను ఆయనతో చెప్పాను" అంటూ పరిటాల రవితో తనకున్న బలమైన అనుబంధాన్ని పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎందరినో ఆకట్టుకుంటోంది.