భారత్-నేపాల్ సరిహద్దులో తృణమూల్ 'పుష్పరాజ్' జహంగీర్ ఖాన్ అరెస్ట్!
- మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడు జహంగీర్ ఖాన్
- ఎన్నికల ఫలితాల తర్వాత ఐదు కొత్త కేసులు నమోదు
- భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ సుదీర్ఘ పాలనకు తెరపడి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే ఒక సంచలన అరెస్ట్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, మాజీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్టయ్యారు.
కలకత్తా హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ లేదా రక్షణ పొడిగించేందుకు నిరాకరించడంతో ఎస్టీఎఫ్ ఈ చర్య తీసుకుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనపై ఐదు కొత్త పోలీస్ కేసులు నమోదయ్యాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత ఆప్తుడు. డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్తా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ వర్గీయులు భయాందోళనలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో యూపీ కేడర్‌కు చెందిన 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ (సింగం ఇమేజ్ ఉన్న ఆఫీసర్) అక్కడ స్పెషల్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. ఫాల్తా ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా జహంగీర్ ఖాన్... టాలీవుడ్ హిట్ సినిమా 'పుష్ప' డైలాగులను వాడుతూ, తానే ఇక్కడి 'పుష్పరాజ్'నని, తగ్గేదేలేదంటూ సవాల్ విసిరారు. ఎన్నికల అవకతవకలు, బెదిరింపుల ఆరోపణలతో అప్పటినుంచే ఆయన పోలీసుల రాడార్‌లో ఉన్నారు.
ఫాల్తా ఉపఎన్నిక ట్విస్ట్:
ఏప్రిల్ 29న ఫాల్తా నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. అయితే ఈవీఎంలలో బీజేపీ బటన్‌పై టేప్ అంటించారనే ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం మే 21న రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈలోపే మే 4న రాష్ట్ర ఫలితాలు వచ్చేసి సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 19న ఊహించని ట్విస్ట్ ఇస్తూ... ఫాల్తా అభివృద్ధి కోసమే పోటీ నుంచి తాను తప్పుకుంటున్నానని జహంగీర్ ప్రకటించారు.
చివరకు ఫాల్తా స్థానంలో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించగా, పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌కు కేవలం 8,000 లోపు ఓట్లు మాత్రమే వచ్చి నాల్గవ స్థానంలో నిలిచారు. ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా, ఈవీఎంలలో ఆయన పేరు ఉండిపోయింది. ఇక, ఎన్నికల తర్వాత అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి సరిహద్దులు దాటాలని చూసిన ఈ తృణమూల్ 'పుష్ప'ను ఎట్టకేలకు బెంగాల్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.