చెస్ సంచలనం ప్రజ్ఞానందకు సీఎం విజయ్ భారీ నజరానా
- నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం
- రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేసిన తమిళనాడు ప్రభుత్వం
- ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను రెండుసార్లు ఓడించి చారిత్రక విజయం
- సత్కార కార్యక్రమంలో ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం
ఓస్లోలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. టోర్నీలో భాగంగా ఆయన ప్రపంచ నంబర్ 1, సొంతగడ్డ ఆటగాడైన మాగ్నస్ కార్ల్‌సెన్‌పై క్లాసికల్ ఫార్మాట్‌లో రెండుసార్లు గెలిచి అరుదైన ఘనత సాధించాడు. అలాగే, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌పై కూడా కీలక విజయం నమోదు చేసి తన సత్తా చాటాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ప్రజ్ఞానంద మేధస్సును, సంయమనాన్ని సీఎం విజయ్ ప్రత్యేకంగా అభినందించారు.
తమిళనాడు క్రీడాభివృద్ధి ప్రాధికార సంస్థ తరఫున రూ. 50 లక్షల చెక్కుతో పాటు జ్ఞాపికను సీఎం విజయ్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఆధవ్ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, ప్రజ్ఞానంద తల్లిదండ్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూన్ 1న విడుదలైన ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్న ప్రజ్ఞానంద, నార్వే చెస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో ఆరో రౌండ్ ముగిసేసరికి చివరి స్థానంలో నిలిచి, అనూహ్యంగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు గేమ్‌లలో గెలిచి టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. చివరి రౌండ్‌లో విన్సెంట్ కీమర్‌పై గెలిచి మొత్తం 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 2021లో కార్ల్‌సెన్ తర్వాత ఒకే ఈవెంట్‌లో వరుసగా నాలుగు గేమ్‌లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.