ధవళేశ్వరం బ్యారేజీకి మహర్ధశ.. రూ.124 కోట్లతో ఆధునికీకరణ పనులు!
- 46 ఏళ్ల తర్వాత ధవళేశ్వరం బ్యారేజీకి పూర్తి స్థాయిలో అప్‌గ్రేడేషన్
- తుప్పు పట్టిన 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు
- రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం
గోదావరి డెల్టా జిల్లాల జీవనాడి, చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ (సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ) ఆధునికీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ ఐకానిక్ నిర్మాణానికి దాదాపు 46 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్ లభించబోతోంది. బ్యారేజీ భద్రతను పెంచడం, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా గోదావరి డెల్టా పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం.
ధవళేశ్వరం బ్యారేజీకి చివరిసారిగా 1980లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేశారు. అయితే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ బ్యారేజీలోని పలు భాగాలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా ఇందులోని 117 గేట్లు తీవ్రంగా తుప్పు పట్టిపోవడంతో, వాటి భద్రతపై నిపుణుల కమిటీలు తమ నివేదికల్లో పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును తలకెత్తుకుంది.
రూ.124 కోట్లతో టెండర్ ఖరారు:
ఈ ఆధునికీకరణ పనుల కోసం ప్రభుత్వం మొదట సుమారు రూ.150 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది.
చివరకు 'బేకమ్' (Becam) కంపెనీ రూ.124.34 కోట్లకు ఈ కాంట్రాక్టును దక్కించుకుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా పాతబడిపోయిన, తుప్పు పట్టిన 117 గేట్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త గేట్లను అమర్చనున్నారు.
ఈ ఆధునికీకరణ పనులన్నింటినీ రాబోయే రెండేళ్ల కాలపరిమితిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే బ్యారేజీ నీటి నిల్వ, విడుదల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ రంగానికి, దీర్ఘకాలిక నీటి అవసరాలకు ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద బూస్ట్‌లా నిలవనుంది. అవసరమైన అధికారిక ఫార్మాలిటీస్ ముగిసిన వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కానున్నాయి.