'పెద్ది' సినిమాలో గ్లామర్ అరాచకం.. జాన్వీ కపూర్ పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్

Janhvi Kapoor old interview video goes viral amid Peddi movie glamour controversy
  • 'పెద్ది'లో జాన్వీ క్యారెక్టర్‌పై ట్రోలింగ్
  • గతంలో ఓవర్‌సెక్సువలైజేషన్‌పై జాన్వీ వ్యాఖ్యలు
  • రన్ అవుతున్న పాత ఇంటర్వ్యూ వీడియో
  • మేకర్స్‌పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
  • డైరెక్టర్ బుచ్చిబాబు సానా వివరణ
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ.. సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర)ను కేవలం గ్లామర్ వస్తువుగా, అత్యంత అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌తో చూపించారంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే.. గతంలో హైపర్‌సెక్సువలైజేషన్, మహిళల అంగీకారం (Consent)పై జాన్వీ కపూర్ చేసిన పాత ఇంటర్వ్యూ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

జూన్ 4న విడుదలైన 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ నటన, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి మార్కులు పడినప్పటికీ.. లవ్ ట్రాక్, హీరోయిన్ పాత్ర రాసిన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక సీన్‌లో హీరో ఆమె కళ్లు, పెదాలను వర్ణిస్తుంటే.. కెమెరా మాత్రం ఆమె ఎద భాగం, నడుమును క్లోజప్‌లో చూపించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "కళ్లు, పెదాలు అంటే ఏంటో తెలియని అంత క్లూలెస్ ఎడిటరా మీరు?" అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

జాన్వీ కపూర్ పాత వ్యాఖ్యలు వైరల్
ఈ బ్యాక్‌లాష్ మధ్య, గత ఏప్రిల్‌లో రాజ్‌ శమాని పాడ్‌కాస్ట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడిన వీడియో క్లిప్ తెరపైకి వచ్చింది. "నా ప్రమేయం లేదా అంగీకారం లేకుండా నన్ను కేవలం సెక్సువలైజ్డ్ (లైంగిక వస్తువుగా) మార్చడాన్ని నేను అస్సలు అంగీకరించను. అది నా వ్యక్తిగత పరిధిని ఉల్లంఘించడమే. సెట్స్‌లో ఉన్నప్పుడు 'ఇది కుదరదు' (యే నహీ చలేగా) అని మన సరిహద్దులను గట్టిగా చెప్పగలగాలి" అని జాన్వీ ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ పాత వ్యాఖ్యలను ఇప్పుడు 'పెద్ది' సినిమా సీన్లతో పోలుస్తూ నెటిజన్లు మేకర్స్‌ను కడిగిపారేస్తున్నారు.

మరోవైపు, ఇన్స్టాగ్రామ్‌లో "భారతీయ సినిమాలో ఒక లీడ్ హీరోయిన్‌కు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం 'పెద్ది'" అంటూ వచ్చిన ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను స్వయంగా జాన్వీ కపూర్ 'లైక్' చేయడం విశేషం. పోస్ట్‌ ప్రొడక్షన్ సమయంలో ఈ సీన్ల గురించి జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. డైరెక్టర్ బాక్సాఫీస్ నంబర్ల కోసం ఆమె అంగీకారాన్ని పక్కనపెట్టి ఫైనల్ ఎడిట్‌లో ఆ సీన్లను ఉంచేశారని ఆ పోస్ట్‌లో రాశారు. దీనిని జాన్వీ లైక్ చేయడంతో ఆమె కూడా దర్శకుడిపై అసంతృప్తితో ఉందనే విషయం స్పష్టమైంది.

దర్శకుడు బుచ్చిబాబు వివరణ
ఈ వివాదంపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ.. ప్రేక్షకుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని తాను అస్సలు ఊహించలేదని అంగీకరించారు. "మేము స్క్రీన్‌పై చూపించాలనుకున్న రొమాన్స్ ట్రాక్ వేరు.. కానీ అది థియేటర్లలో ప్రేక్షకులకు వేరేలా కన్పించి అసౌకర్యాన్ని కలిగించింది. భవిష్యత్తులో మహిళల పాత్రలను చూపించేటప్పుడు మరింత జాగ్రత్తగా, సెన్సిటివ్‌గా వ్యవహరిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. 
Go Back to Shorts
Janhvi Kapoor
Peddi movie
Ram Charan
Buchi Babu
Peddi movie controversy
Janhvi Kapoor old interview
Achiyamma character
Peddi movie review
Janhvi Kapoor viral video
Telugu cinema news

More Telugu News