కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సూర్యకుమార్ యాదవ్ భేటీ!

  • టీ20 కెప్టెన్సీ మార్పు ఊహాగానాల వేళ సీఎంతో భేటీ
  • నేడు ఆన్‌లైన్‌లో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్
  • ఐపీఎల్ 2026లో సూర్యకుమార్ పేలవ ప్రదర్శన
  • రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్
భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై ఊహాగానాలు నడుస్తున్న వేళ.. టీమిండియా స్టార్ బ్యాటర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ముంబైలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం 'వర్ష'లో జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకమైనదేనని అధికారులు చెప్తున్నప్పటికీ, క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నెలాఖరులోనే భారత జట్టు తదుపరి టీ20 సిరీస్ ఆడాల్సి ఉండటంతో, ఈ లోపే కెప్టెన్సీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

"ఈరోజు భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ముంబైలోని అధికారిక నివాసం 'వర్ష'లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు" అని మహారాష్ట్ర సీఎంవో (CMO) ఎక్స్ వేదికగా ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, రాబోయే కొత్త సైకిల్‌లో ఆయనను కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై శనివారం (జూన్ 6) బీసీసీఐ (BCCI) ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 కారణం ఆ ఫామ్ లేమేనా? 
2024లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్.. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండోసారి ట్రోఫీని అందించి కెప్టెన్‌గా తన సత్తా చాటాడు. అయితే, ఇటీవల కాలంలో ఆయన బ్యాటింగ్ ఫామ్ దారుణంగా పడిపోవడం ఇప్పుడు కెప్టెన్సీ చుట్టూ వివాదాలు ముసురుకునేలా చేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్.. 13 మ్యాచ్‌ల్లో కేవలం 20.76 సగటుతో 270 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కూడా 9వ స్థానంతో సరిపెట్టుకుంది.

 రేసులో కొత్త కెప్టెన్లు 
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశిస్తుండటం, అలాగే తదుపరి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఇప్పటి నుంచే కొత్త లీడర్‌ను తయారు చేయాలని భావిస్తోంది. ఒకవేళ సెలక్టర్లు సూర్యకుమార్ స్థానంలో కొత్త ముఖాన్ని ఎంపిక చేయాలనుకుంటే.. రేసులో హార్దిక్ పాండ్యా అందరికంటే ముందున్నాడు. వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. వీరితో పాటు దేశవాళీ టోర్నీల్లో రాణించిన సంజూ శాంసన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

భారత జట్టు జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన టీమ్ సెలక్షన్ ఈ నెలాఖరులోనే జరగనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, జింబాబ్వే సిరీస్‌లు కూడా లైన్‌లో ఉన్నాయి. మరి ఈ సిరీస్‌ల నాటికి 'మిస్టర్ 360' తన కెప్టెన్సీ సీటును కాపాడుకుంటాడో లేదో చూడాలి.

Suryakumar Yadav
Devendra Fadnavis
Indian T20 Captaincy
BCCI Apex Council Meeting
Mumbai Indians
IPL 2026
Hardik Pandya
Shreyas Iyer
Indian Cricket Team
Maharashtra CM

More Telugu News