ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో భారీ తిరుగుబాటు.. మమతా బెనర్జీ చేజారిన పార్టీ?

Huge rebellion in TMC after election defeat Did Mamata Banerjee lose control of the party
  • అసెంబ్లీ ఎన్నికల ఓటమితో టీఎంసీ తీవ్ర సంక్షోభం
  • 58 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుదారుల క్యాంప్
  • ఎల్‌వోపీగా రీతబ్రత బెనర్జీని గుర్తించిన స్పీకర్
  • అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపై అసమ్మతి
  • కోర్టు మెట్లు ఎక్కనున్న మమతా బెనర్జీ వర్గం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ.. ప్రస్తుతం తన మూడు దశాబ్దాల చరిత్రలోనే అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీని కాదని, మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో 58 మంది తిరుగుబాటు పక్షాన నిలిచారు. ఈ రెబెల్ వర్గం శాసనసభలో తామే అసలైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ తిరుగుబాటు గ్రూపులో కూడా అంతర్గత విభేదాలు పొడసూపడంతో, పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ రాజకీయ హైడ్రామా పతాక స్థాయికి చేరింది. బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మెజారిటీ శాసనసభ్యుల మద్దతు ఉండటంతో, ఆయనను అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా (LoP) గుర్తిస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ రెబెల్స్ గ్రూపును అధికారికంగా గుర్తించడం మమత వర్గానికి గట్టి ఎదురుదెబ్బ. అయితే, ఈ తిరుగుబాటు నేతలు మమతా బెనర్జీపై తమకున్న గౌరవాన్ని ప్రదర్శిస్తూనే.. ఆమెను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని 'ప్రధాన సలహాదారు'గా ఉండాలని ప్రతిపాదించడం పార్టీలో కొత్త చర్చకు దారితీసింది.

అసమ్మతికి కారణం అదేనా?
ఈ తిరుగుబాటు మమతా బెనర్జీపై కంటే, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలపైనేనని స్పష్టమవుతోంది. చాలా కాలంగా పార్టీ సీనియర్ నేతలను పక్కనపెట్టి అభిషేక్ బెనర్జీ సర్వాధికారాలు చెలాయించడంపై క్షేత్రస్థాయి నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే, రెబెల్స్ క్యాంప్‌లో కూడా కొందరు ఎమ్మెల్యేలు మమతా బెనర్జీనే తమ "సుప్రీం లీడర్" అని, ఆమె అధికారాన్ని తగ్గించడానికి వీల్లేదని వాదిస్తున్నారు. కనీసం 23 మంది టీఎంసీ ఎంపీలు కూడా ఈ తిరుగుబాటు వర్గంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు మమతా బెనర్జీ జూన్ 5న తన నివాసంలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. తిరుగుబాటుదారుడు రితబ్రత బెనర్జీని ఎల్‌వోపీగా గుర్తించిన స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జూన్ 8 (సోమవారం)న కలకత్తా హైకోర్టును ఆశ్రయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ నిర్ణయం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. అంతేకాకుండా, పార్టీలో తిరుగుబాటును అణచివేసేందుకు వీలుగా బెంగాల్‌లోని అన్ని కీలక రాష్ట్ర కమిటీలు, ఫ్రంటల్ సంస్థలను మమత రద్దు చేశారు.

భవిష్యత్తుపై అనిశ్చితి
గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన టీఎంసీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోయి 80 స్థానాలకే పరిమితమైంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తరహాలోనే ఇప్పుడు బెంగాల్‌లో కూడా పార్టీ పేరు, గుర్తు కోసం కోర్టుల్లో సుదీర్ఘ చట్టపరమైన పోరాటం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీధి పోరాటాలతో పార్టీని నిర్మించిన మమతా బెనర్జీ.. ఈ చట్టపరమైన, రాజకీయ సంక్షోభాన్ని దాటుకుని పార్టీని ఎలా కాపాడుకుంటారనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
Go Back to Shorts
Mamata Banerjee
Trinamool Congress
West Bengal politics
Abhishek Banerjee
Ritabrata Banerjee
TMC rebellion
Bengal Assembly election
Calcutta High Court
Speaker Rathindra Bose
West Bengal LoP

More Telugu News