ఇది ఏఐ తయారు చేసిన వ్యాక్సిన్... ప్రపంచంలో ఇదే మొదటిసారి!
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో యూనివర్సల్ వ్యాక్సిన్ రూపకల్పన
- తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు
- అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించేలా పరిశోధన
- భవిష్యత్ మహమ్మారులను అడ్డుకోవడమే లక్ష్యమని శాస్త్రవేత్తల వెల్లడి
'pEVAC-PS' పేరుతో పిలిచే ఈ నూతన వ్యాక్సిన్‌ను తొలి దశలో భాగంగా 39 మంది ఆరోగ్యవంతులపై పరీక్షించారు. ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని తేలిందని, వలంటీర్లలో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా వైరస్ కుటుంబంలోని అన్ని రకాల వేరియంట్లను దీటుగా ఎదుర్కొనేలా రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేసే 'సూపర్-యాంటిజెన్'ను ఏఐ ద్వారా అభివృద్ధి చేశారు. వైరస్ల జన్యుక్రమంలో మార్పు చెందని కీలక భాగాలను లక్ష్యంగా చేసుకుని ఇది పనిచేస్తుంది.
సాధారణంగా వైరస్లు కొత్త రూపాంతరం చెందినప్పుడు అందుకు అనుగుణంగా వ్యాక్సిన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ సరికొత్త విధానం వైరస్లు ప్రబలకముందే వాటిని నిరోధించేలా పనిచేస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జొనాథన్ హీనీ తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు సోకే కొత్త రకం వైరస్‌లను సైతం ఇది సమర్థంగా అడ్డుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక 'జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్'లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం 200 మందికి పైగా వలంటీర్లతో రెండో దశ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఫ్లూ, ఎబోలా వంటి ఇతర ప్రాణాంతక వైరస్‌లకు వ్యాక్సిన్ల తయారీలోనూ వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయి ఫలితాల కోసం మరిన్ని పరీక్షలు అవసరమైనప్పటికీ, ప్రజారోగ్య పరిరక్షణలో ఇది ఒక గొప్ప ముందడుగు అని వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.