పాక్ గూఢచర్యం కేసు... యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ
- ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
- కీలక ప్రాంతాల సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు పంపినట్లు ఆరోపణలు
- ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలిగా గుర్తింపు
- గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులోనూ ఆమెకు బెయిల్ తిరస్కరణ
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, ఆమెకు ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. ఈ ఏడాది మార్చిలో పంజాబ్, హర్యానా హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమెపై దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది.
హర్యానా పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో జ్యోతిపై అధికారిక రహస్యాల చట్టం (1923), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద పలు సెక్షన్లతో అభియోగాలు మోపారు. 'ట్రావెల్ విత్ జో' అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ఆమె, పాకిస్థాన్ పర్యటనల సందర్భంగా న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారి ఎహసాన్-ఉర్-రహీంతో పరిచయం పెంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా పలువురు పాక్ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరచుకుని, వ్యూహాత్మక ప్రాంతాలైన పాండో డ్యామ్, మున్నాబావో రైల్వే స్టేషన్, సీఆర్పీఎఫ్ క్యాంప్ వంటి వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు పంపినట్లు పోలీసులు ఆరోపించారు.
ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని, దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ కూడా దాఖలైనందున బెయిల్ మంజూరు చేయాలని జ్యోతి వాదించింది. అయితే, ఆమె పాక్ ఏజెంట్లతో రహస్య సంభాషణలు జరిపారని, చాట్ రికార్డులను తొలగించారని దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. 2025 మే 16న హిసార్‌లో నమోదైన ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి, అప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. గత ఏడాది ఆగస్టులో సిట్ సుమారు 2,500 పేజీల చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.