‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి!
- భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది'
- అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన
- ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ భార్య ఉపాసన స్వయంగా మెగా ఫ్యాన్స్‌తో కలిసి ఈ విజయానందాన్ని పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉపాసన పాల్గొన్నారు. అభిమానుల మధ్యకు వచ్చి, వారితో కలిసి స్పెషల్ విక్టరీ కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకకు తరలివచ్చిన చిన్నారులకు ఉపాసన తన చేతులతో కేక్ తినిపించి, అభిమానులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి అందరి మనసులను గెలుచుకున్నారు.
ఈ సంబరాల్లో అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి రచ్చ చేయగా.. మెగా మహిళా అభిమానులు ఉపాసనకు సాంప్రదాయబద్ధంగా దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
కేవలం ఇంట్లోనే కాకుండా, బుధవారం రాత్రి హైదరాబాద్ మూసాపేటలోని ‘శ్రీరాములు థియేటర్’లో జరిగిన ‘పెద్ది’ ప్రీమియర్ షోకు ఉపాసన తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. సాధారణ ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూసిన ఆమె.. స్క్రీన్‌పై రామ్ చరణ్ ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో మిగతా ఫ్యాన్స్‌తో కలిసి ఎంతో ఉత్సాహంగా కేకలు వేస్తూ సందడి చేశారు.