ప్రభుత్వ సెక్యూరిటీలపై ఆదాయపు పన్ను రద్దు.. విదేశీ పెట్టుబడిదారులకు కేంద్రం బంపర్ ఆఫర్!
- విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే కేంద్రం లక్ష్యం
- ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ జారీ
- ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి నిబంధనలు
- విదేశీ ఇన్వెస్టర్ల లాభాలు పన్ను రహితం
ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ముందస్తు తేదీతో అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి ఈ చర్యలు ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఈ మార్పుల వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార నిర్వహణ సులభతరం కానుంది. దేశంలోకి దీర్ఘకాలిక మూలధన ప్రవాహాన్ని పెంచడానికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలవనుంది.
సవరించిన నిబంధనల ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 12.5 శాతం నుంచి సున్నాకి తగ్గించారు. అలాగే వడ్డీ ఆదాయంపై విధించే 20 శాతం విత్‌హోల్డింగ్ పన్నును పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్లకు భారతీయ సార్వభౌమ బాండ్ల ద్వారా వచ్చే లాభాలు పూర్తిగా పన్నురహితంగా మారతాయి. ఇదే రకమైన పన్ను మినహాయింపులను స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్కు కూడా కేంద్రం పొడిగించింది.