ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారన్న అమెరికా
- అణు చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్నారన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- పదవి చేపట్టినప్పటి నుంచీ బహిరంగంగా కనిపించని మోజ్తబా
మంగళవారం సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో సాక్ష్యమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మోజ్తబా ఖమేనీ నిర్ణయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయితే అన్ని సంప్రదింపులు కేవలం రాతపూర్వకంగా, మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి" అని వివరించారు.
ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కుమారుడైన 56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఆ దాడుల్లో మోజ్తబా కూడా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆయన బయట కనిపించలేదు. దీంతో ఆయన జీవించే ఉన్నారా? లేదా? అనే దానిపై అమెరికా సహా అంతర్జాతీయంగా అనేక ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆ ఊహాగానాలను తెరదించుతూ మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. మొజ్తబా ఖమేనీ ఇరాన్ అంతర్గత, దౌత్యపరమైన విషయాలలో ఏదో ఒక స్థాయిలో పాలుపంచుకుంటున్నారనే సంకేతాలు తమకు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్ ఉన్న పరిస్థితుల్లో అక్కడి నాయకులు బహిరంగంగా బయటకు రావడం క్షేమకరం కాదని ఆ దేశ అంతర్గత వర్గాలు భవించి ఉండవచ్చని కానీ ఆయన కచ్చితంగా సజీవంగానే ఉన్నారని రుబియో పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ సైతం ఇటీవల మాట్లాడుతూ సుప్రీం లీడర్ అనుమతి లేకుండా దేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు జరగవని పేర్కొన్నారు.