ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

  • వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • ఆక్వా రైతులకు భారీ ఊరట
  • కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ
  • అధికారులకు కీలక ఆదేశాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్లూ ఎకానమీ దిశగా అడుగులు వేస్తూ ఆక్వా రైతులకు భారీ ఊరట కల్పించారు. కొత్త ఆక్వా కనెక్షన్లకు కూడా విద్యుత్ సబ్సీడీ ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రస్తుతం యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఇస్తున్న విద్యుత్ సబ్సిడీని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు కూడా వర్తింపజేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 50 వేల కనెక్షన్లకు ప్రభుత్వం ఏటా రూ.1,100 కోట్ల సబ్సిడీ భరిస్తోందని, తాజా నిర్ణయంతో మరో రూ.188 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు. రాష్ట్రంలో ఆక్వా సాగవుతున్న 4 లక్షల ఎకరాలనూ ఆక్వా జోన్ పరిధిలోకి తేవాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఆక్వా రంగాన్ని 'బ్లూ ఎకానమీ'గా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. నాణ్యత ధృవీకరణ, ట్రేసబిలిటీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రూ.240 కోట్ల వ్యయంతో 200 అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపారు.

 రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి స్థానిక మత్స్యకారుల ఆదాయం పెంచాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసి, 'డిజి రైతు బజార్' యాప్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
AP CM
Aqua farmers
Andhra Pradesh
Aqua subsidy
Blue economy
Fisheries
Aqua zone
Acham Naidu

More Telugu News