ఘోరం.. నలుగురు మహిళలను వేటాడి చంపిన పులి!

  • మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా అడవుల్లో ఉదంతం
  • బీడీ ఆకులు ఏరుకుంటుండగా పులి దాడి
  • తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకుండా మాటువేసి వేట
  • ఘటనా స్థలంలోనే నలుగురి ప్రాణాలు విడిచిన వైనం
  • రంగంలోకి దిగిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలో ఘోరం జరిగింది. అడవికి వెళ్లిన నలుగురు మహిళలపై పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. గంజేవాహి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆకులు ఏరుకుంటుండగా
చంద్రపుర్ జిల్లా సిందేవహి తాలుకా పరిధిలోని గ్రామీణ ప్రజలు ప్రతిరోజూ ఉదయాన్నే అడవికి వెళ్లడం అలవాటు. అక్కడ దొరికే ఎండిపోయిన బీడీ ఆకులను ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. శుక్రవారం ఉదయం కూడా గంజేవాహి ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 గంటల సమయంలో వీరంతా ఆకులు ఏరుకోవడంలో నిమగ్నమై ఉండగా పులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసింది.

క్షణాల వ్యవధిలోనే
మహిళలు గమనించే లోపే పులి వారిపై భయంకరంగా విరుచుకుపడింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం.. మహిళలకు కనీసం తప్పించుకునే లేదా కేకలు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా వేటాడింది. దీంతో తీవ్ర గాయాలైన నలుగురు మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోయారు.

గ్రామాల్లో ఉద్రిక్తత
ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే అటవీ ప్రాంతం చుట్టుపక్క ఉన్న గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి అంజలీ సాయంకర్‌ తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒకేసారి నలుగురు మహిళలు పులి దాడిలో బలికావడంతో అటవీ శాఖ నిర్లక్ష్యంపై గ్రామీణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులిని వెంటనే బంధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Chandrapur Tiger Attack
Chandrapur
Tiger Attack
Maharashtra
Forest Department
Ganjewahi
Sindewahi
Human Wildlife Conflict
Tiger
India

More Telugu News