పెళ్లికి వెళ్లి తిరిగిరాని కుటుంబం... 26 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

Munilal Family Found After 26 Years in Punjab Canal
  • పంజాబ్‌లోని భాక్రా కాలువలో మారుతీ వ్యాన్‌, నాలుగు అస్థిపంజరాల లభ్యం
  • 2000వ సంవత్సరంలో అదృశ్యమైన మునిలాల్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
  • స్థానిక డైవర్ చొరవతో వెలుగులోకి వచ్చిన దశాబ్దాల నాటి విషాదం
దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పాతికేళ్ల క్రితం పెళ్లికి వెళ్లి అదృశ్యమైన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. అయితే, వారు జీవించి లేరని తెలియడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా, కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలోని భాక్రా కాలువలో ఒక పాత మారుతీ ఓమ్ని వ్యాన్‌తో పాటు నాలుగు అస్థిపంజరాలను అధికారులు వెలికితీయడంతో ఈ దశాబ్దాల నాటి మిస్టరీ వీడింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలోని కోట్లా గ్రామానికి చెందిన మునిలాల్, తేజ్ రామ్, సుర్జిత్ సింగ్, ఎనిమిదేళ్ల బాలుడు కాలు... 2000వ సంవత్సరం అక్టోబర్ 20న ఒక వివాహ వేడుకకు మారుతీ ఓమ్ని వ్యాన్‌లో వెళ్లి తిరిగి రాలేదు. అప్పట్లో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి, లక్షల రూపాయలు ఖర్చు చేసి భాక్రా కాలువ పరిసరాల్లో వెతికారు. అయినా వ్యాన్ గానీ, అందులోని వారి ఆచూకీ గానీ లభించలేదు.

కాలక్రమేణా ఈ కేసు మరుగునపడిపోయింది. అయితే, ఇటీవల స్థానిక డైవర్ కమల్‌ప్రీత్ సైనీ నీటి అడుగున గాలిస్తుండగా 32 అడుగుల లోతులో ఉన్న ఒక పాత వాహనం కనిపించింది. అధికారులకు సమాచారం అందించడంతో ఆ వ్యాన్‌ను బయటకు తీశారు. లోపల నాలుగు అస్థిపంజరాలతో పాటు స్కూల్ యూనిఫాంను పోలిన ఒక షర్టు లభించింది. దాని ఆధారంగా బంధువులు మృతులను గుర్తించారు.

ఈ ఘటనపై మృతుడు మునిలాల్ భార్య సీతా దేవి మాట్లాడుతూ.. "పెళ్లికి వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో అప్పట్లో అన్నిచోట్లా వెతికాం. మా ఆస్తులన్నీ అమ్ముడైపోయాక గాలింపు ఆపేశాం. ఇన్నేళ్ల తర్వాత మా వాళ్ల అవశేషాలను కనుగొనడంలో సహాయపడిన డైవర్ కమల్‌ప్రీత్‌కు ధన్యవాదాలు" అని ఆవేదన వ్యక్తం చేశారు. మునిలాల్ కుమారుడు గురువిందర్ మాట్లాడుతూ, తమ తండ్రి అదృశ్యంతో కుటుంబం ఎన్నో ఏళ్లుగా మానసిక ప్రశాంతతను కోల్పోయిందని, ఇప్పుడు అవశేషాలు దొరకడంతో కొంత ఊరట లభించిందని తెలిపారు.

అధికారికంగా మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ సహాయం కూడా అందక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని బంధువు సందీప్ సింగ్ వాపోయారు. అప్పట్లో గాలింపు కోసం సుమారు రూ. 1.5 లక్షలు ఖర్చు చేశామని, కాలువలో నీటి ప్రవాహం బలంగా ఉండటంతో వాహనం కొట్టుకుపోయి ఉంటుందని భావించామని, కానీ ప్రమాదం జరిగిన చోటే అది దొరకడం ఆశ్చర్యంగా ఉందని మరో బంధువు రామ్ కుమార్ అన్నారు.

కుటుంబ సభ్యులు మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, అస్థికలను నిమజ్జనం చేశారు. ఈ ఘటనతో తమ కుటుంబానికి ఇన్నేళ్లకు కాస్త శాంతి లభించిందని వారు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Punjab
Munilal
Punjab accident
Rupnagar district
Bhakhra canal
missing family
car accident
India news
canal accident
Kotla village
unsolved mystery

More Telugu News