మహిళా హాస్టల్‌పై 30 మందితో వెళ్లి దాడి: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదు!

 Hyderabad Ex Mayors Wife Bonthu Sridevi Booked in Hostel Assault Case
  • అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లోకి చొరబాడి దాడి చేసిన శ్రీదేవి
  • భవన యజమాని అయిన శ్రీదేవి తల్లికి, హాస్టల్ నిర్వాహకుడికి కొంత కాలంగా లీగల్ వివాదం
  • కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక మహిళా హాస్టల్‌లోకి చొరబడి కొందరు దుండగులు దౌర్జన్యకాండకు, రౌడీయిజానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి, ఆమె అనుచరులు బుధవారం రాత్రి ఒక గర్ల్స్ హాస్టల్‌పై దాడి చేసి హల్‌చల్ చేసిన ఉదంతంపై ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.


బాధితులు మరియు పోలీసుల కథనం ప్రకారం... అమీర్‌పేట జీహెచ్‌ఎంసీ మార్కెట్ రోడ్‌లో 'ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్'ను వీరహనుమాన్ రెడ్డి అనే వ్యక్తి గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ హాస్టల్ నడుస్తున్న భవన యజమాని బోయమ్మ కుటుంబానికి, నిర్వాహకుడు వీరహనుమాన్ రెడ్డికి మధ్య కొంతకాలంగా లీగల్ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే హాస్టల్‌ను ఎలాగైనా ఖాళీ చేసి, స్వాధీనం చేయాలని భవన యజమాని కూతురైన బొంతు శ్రీదేవి, ఆమె కుటుంబ సభ్యులు నిర్వాహకుడు వీర హనుమాన్ పై ఒత్తిడి తెస్తున్నారు.

బుధవారం రాత్రి బొంతు శ్రీదేవి, ఆమె తల్లి బోయమ్మ దాదాపు 30 మంది అనుచరులతో కలిసి ఒక్కసారిగా మహిళా హాస్టల్‌పై దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న వార్డెన్ రాజ్యలక్ష్మి, సూపర్‌వైజర్ శిరీష, వంట మనిషి భార్య అపర్ణలపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగుతూ, చేతులతో కొడుతూ, కిందపడేసి కాళ్లతో తన్నారు. తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు గమనించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిని ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, వారి మొబైల్స్ లాక్కుని, ఒకరి బంగారు గొలుసును కూడా అపహరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.


ఈ భవన వివాదంపై ఇప్పటికే కోర్టులో సివిల్ కేసు నడుస్తోందని, కోర్టు 'స్టేటస్ కో' (యథాతథ స్థితి) ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ఏమాత్రం కేర్ చేయకుండా బొంతు శ్రీదేవి అనుచరులు ఈ దాడులకు పాల్పడ్డారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా డయల్ 100కు ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దాడి వీడియోలపై బొంతు శ్రీదేవి స్పందించారు. ఈ వీడియోలు ఇప్పటివి కావని, గత ఏడాదికి సంబంధించిన వీడియోలంటూ ఆమె ఒక మీడియా సంస్థకు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం హాస్టల్ నిర్వాహకుడు వీరహనుమాన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, దాడికి పాల్పడిన బొంతు శ్రీదేవి, ఆమె తల్లి బోయమ్మతో పాటు మరో 30 మంది అనుచరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒక మహిళా హాస్టల్‌లోకి ఇంతమంది చొరబడి దౌర్జన్యం చేయడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
Go Back to Shorts
Bonthu Sridevi
Hyderabad
Womens hostel attack
Panjagutta police
Bonthu Rammohan
GHMC
Ameerpet
Veera Hanuman Reddy
Boyamma
Property dispute

More Telugu News