ధోనీ రిటైర్మెంట్‌ హింట్‌ ఇచ్చారా? రైనా వెల్లడించిన ఆసక్తికర విషయం

  • ధోనీతో వ్యక్తిగత సంభాషణను బయటపెట్టిన రైనా
  • 2027లోనూ ధోనీ ఆడాలని రైనా ఆకాంక్ష
  • శరీరం బలహీనంగా ఉందన్న ధోనీ
  • చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్‌కు ధోనీ అభివాదం
  • రిటైర్మెంట్‌ హింట్‌ ఇచ్చారంటూ విశ్లేషణలు
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజం ఎం.ఎస్ ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఆయన వచ్చే సీజన్‌లోనూ ఆడాలని సీఎస్‌కే మాజీ స్టార్ సురేష్ రైనా ఆకాంక్షించాడు. చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓటమి తర్వాత ‘స్టార్ స్పోర్ట్స్‌’తో రైనా మాట్లాడాడు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌పై వారిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణను పంచుకున్నాడు.

‘‘నేను ధోనీతో మాట్లాడాను. నువ్వు ఐపీఎల్ 2026 సీజన్‌కు కేవలం మిస్డ్‌కాల్ ఇచ్చావంతే. ఇది లెక్కలోకి రాదు. వచ్చే ఏడాది కచ్చితంగా ఆడాల్సిందేనని నేను అతడితో అన్నాను’’ అని రైనా వెల్లడించాడు. దానికి ధోనీ స్పందిస్తూ.. ‘‘నా శరీరం కొంచెం బలహీనంగా అనిపిస్తోంది’’ అన్నాడని రైనా తెలిపాడు. అయితే ‘‘మేం అవేమీ నమ్మం. నువ్వు వచ్చే ఏడాది ఆడాల్సిందేనని నేను స్పష్టం చేశాను’’ అని రైనా వెల్లడించాడు. ఇది ధోనీ వ్యక్తిగత నిర్ణయమైనప్పటికీ అతను మాత్రం పాజిటివ్‌గానే ఉన్నట్లు తనకు అనిపించిందని తెలిపాడు.

ధోనీ ఈ సీజన్‌ మొత్తం తుది జట్టులో లేడు. కనీసం స్టేడియంలో కూడా కనిపించలేదు. కానీ నిన్న అతణ్ని చెపాక్‌లో చూసి ఫ్యాన్స్‌ భావోద్వేగానికి గురయ్యారు. టీమ్ ఫొటోగ్రాఫ్ కోసం మైదానంలోకి రాగానే స్టేడియం దద్దరిల్లింది. ఎలాంటి స్పీచ్‌ ఇవ్వకుండానే, బౌండరీ లైన్ వెంట నడుస్తూ అభిమానులకు అభివాదం చేశాడు. 44 ఏళ్ల ధోనీ చెపాక్ హోమ్ గ్రౌండ్‌లో కనిపించడం ఇదే చివరిసారి కావచ్చనే బాధతో ఫ్యాన్స్ భావోద్వేగంతో నినాదాలు చేశారు. మరోవైపు రైనాతో ధోనీ వ్యాఖ్యలు, చెపాక్‌లో కనిపించి అభివాదం చేయడం ఆయన రిటైర్మెంట్‌ హింట్ అయ్యుండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు.

MS Dhoni
Dhoni retirement
Suresh Raina
Chennai Super Kings
CSK
IPL 2026
Chepauk Stadium
IPL future
Cricket
SRH

More Telugu News