తల్లి చివరి కోరిక.. 71 ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసిన యూపీ వాసి

  • ఉత్తరప్రదేశ్‌లో నీట్ పరీక్ష రాసిన అశోక్ బహార్
  • కుర్తా-పైజామా ధరించి పరీక్షకు హాజరైన బహార్
  • కుటుంబంలో భార్య సహా వైద్య వృత్తిలో పలువురు
కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి వయస్సు అడ్డంకి కానేకాదని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన అశోక్ బహార్ నిరూపించారు. తనను డాక్టర్‌గా చూడాలని కలలుకన్న తన తల్లి చివరి కోరికను నెరవేర్చడానికి ఆయన 71 ఏళ్ల వయస్సులో 'నీట్' పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరు కాగా, యువకుల మధ్యలో కూర్చుని ఆయన పరీక్షలు రాయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆలంబాగ్‌లోని చందర్‌నగర్‌కు చెందిన అశోక్ బహార్ మే 3వ తేదీన నీట్ పరీక్షకు హాజరయ్యారు. కుర్తా-పైజామా ధరించి, చేతిలో నీళ్ల సీసా, ప్రశ్నాపత్రంతో పరీక్ష అనంతరం బయటకు నడుస్తున్న ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

బహార్ ఒక ఎరువుల కంపెనీలో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేసి, 2000 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. లక్నో విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఎల్ఎల్‌బీ, ఎంబీఏ పూర్తి చేశారు. కానీ డాక్టర్ కావాలనే తన తల్లి, తన చిరకాల కోరికను నెరవేర్చుకునేందుకు ఆయన నీట్ పరీక్ష రాశారు. ఆయన కుటుంబంలో డాక్టర్లు ఉన్నారు. ఆయన భార్య మంజుల్ బహార్ వైద్యురాలు కావడం గమనార్హం. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. భార్యతో పాటు ఆయన కుటుంబంలో కూడా కొంతమంది వైద్యవృత్తిలో ఉన్నారు.

నీట్ పరీక్ష రాయడానికి ఎలాంటి వయోపరిమితి లేదని అశోక్ బహార్ తెలిపారు. వయస్సు లేదా పరిస్థితుల కారణంగా ప్రజలు తమ కలలను వదులుకోవద్దని, వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని సూచించారు. 2020లో ఒడిశాలోని సంబాల్‌పూర్‌కు చెందిన 4 ఏళ్ల జైకిషోర్ ప్రధాన్ కూడా బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన అనంతరం నీట్ పరీక్ష రాశారు. ఆ తర్వాత ఆయన వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందారు. ఢిల్లీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోను పలువురు వృద్ధులు నీట్ పరీక్షలు రాశారు.

Ashok Bahar
NEET exam
Lucknow
MBBS
medical entrance exam
age no bar
NEET
Uttar Pradesh

More Telugu News