కేటీఆర్‌లా దోచుకోవడం, దాచుకోవడం తెలియదు: బండి సంజయ్ ఆగ్రహం

  • బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి ఇబ్బందులకు గురి చేశారన్న బండి సంజయ్
  • అలా హింసించడం తమకు తెలియదన్న బండి సంజయ్
  • వారిలా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌లా దోచుకోవడం, దాచుకోవడం తనకు తెలియదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారని, అలా హింసించడం తనకు తెలియదని అన్నారు. వారిలా డ్రగ్స్ తీసుకోవడం కూడా తనకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసు, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చేయడం తమకు తెలియదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. వారి అహంకారం వల్లనే కేసీఆర్ ఓడిపోయి ఫామ్ హౌస్‍‌కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నప్పటికీ కేటీఆర్‌లో మార్పు రావడం లేదని వ్యాఖ్యానించారు.

పరేడ్ మైదానంలో ఈ నెల 10వ తేదీన జరగబోయే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తోందని అన్నారు. కేంద్ర నిధులతో తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందని అన్నారు. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం మేం ఢిల్లీ నుంచి నిధులు తెస్తుంటే, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఇక్కడి నిధులను అధిష్ఠానానికి పంపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నడుపుకోవడానికి తెలంగాణ సొమ్ము ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మోదీ తెలంగాణ అభివృద్ధి కోసమే వస్తున్నారని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay
KTR
BRS
Telangana
BJP
Narendra Modi
Corruption
Kaleshwaram Project
Congress

More Telugu News