బౌలర్లకు అన్యాయం జరుగుతోంది.. ఆ నిబంధన మార్చండి: గంగూలీకి గవాస్కర్ కీలక సూచన

  • క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యంపై గవాస్కర్ ఆందోళన
  • బౌన్సర్లకు సంబంధించిన వైడ్ నిబంధన మార్చాలని సూచన
  • గతంలో బౌన్సర్లను తిరిగి ప్రవేశపెట్టడం వల్లే పించ్ హిట్టర్లు కనుమరుగయ్యారని వెల్లడి
  • బౌలర్లకు న్యాయం చేయాలంటూ ఐసీసీ కమిటీ ఛైర్మన్ గంగూలీకి విజ్ఞప్తి
టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత ఈ ఆట పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని, బౌలర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. బౌండరీల కుదింపు, కఠినమైన ఫీల్డింగ్ ఆంక్షలు, శక్తిమంతమైన బ్యాట్‌లతో బ్యాటర్లు రాజ్యమేలుతున్నారని, ఆటలో సమతుల్యత తీసుకురావడానికి ఐసీసీ వెంటనే నిబంధనలు మార్చాలని స‌న్నీ సూచించాడు. ముఖ్యంగా బౌన్సర్లకు సంబంధించిన "వైడ్ బాల్" నిబంధనను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశాడు.

ప్రస్తుతం బ్యాటర్ తల మీదుగా బంతి వెళ్తే, దానిని వెంటనే వైడ్ ఇస్తున్నారని, ఇది ఫాస్ట్ బౌలర్ చేతులు కట్టేసి బౌలింగ్ చేయమని చెప్పినట్లుగా ఉందని గవాస్కర్ పేర్కొన్నాడు. "ఒక ఫాస్ట్ బౌలర్‌కు కొంత వెసులుబాటు ఇవ్వాలి కదా? ఇప్పటికే బౌండరీలు చిన్నవి చేసి బౌలర్లను నష్టపరుస్తున్నారు. ఇప్పుడు తల మీదుగా వెళ్లే బంతిని వైడ్ అనడం వారిని మరింత బలహీనపరచడమే. బ్యాటర్ సాధారణంగా నిలబడినప్పుడు, అతని తల పైనుంచి దాదాపు ఒక అడుగు (బ్యాట్ హ్యాండిల్ పొడవు) ఎత్తు వరకు బౌన్సర్ వేసేందుకు అనుమతిస్తే, ఫాస్ట్ బౌలర్లకు కొంత ఉపశమనం లభిస్తుంది" అని గ‌వాస్క‌ర్‌ వివరించాడు.

గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌన్సర్లు పూర్తిగా నిషేధించినప్పుడు జరిగిన పరిణామాలను గవాస్కర్ గుర్తుచేశాడు. "అప్పట్లో టెస్టుల్లో 9 లేదా 10వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు, వన్డేల్లో పించ్ హిట్టర్ల పేరుతో 3, 4 స్థానాల్లో వచ్చి ఆడేవారు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, అంబ్రోస్, డొనాల్డ్, శ్రీనాథ్ వంటి మేటి బౌలర్లను కూడా వారు నిర్భయంగా బాదేసేవారు. ఎందుకంటే తలకు బంతి తగులుతుందనే భయం వారికి లేదు" అని అన్నాడు.

"నేను ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిగతా సభ్యుల మద్దతుతో బౌన్సర్‌ను తిరిగి ప్రవేశపెట్టాం. ప్రతి బ్యాటర్‌కు ఓవర్‌కు ఒక బౌన్సర్ అనుమతించాం. దీంతో పించ్ హిట్టర్లు కనుమరుగయ్యారు. బౌలర్లకు వారి ప్రధాన ఆయుధం తిరిగి లభించింది. ఒక బ్యాటర్ ఎలాంటి షాట్ ఆడాలనే దానిపై మీరు ఆంక్షలు పెట్టనప్పుడు, బౌలర్ల విషయంలో ఎందుకు అన్ని ఆంక్షలు విధిస్తున్నారు?" అని గవాస్కర్ ప్రశ్నించాడు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ రాబోయే సమావేశంలో బౌలర్ల గురించి ఆలోచించాలని గవాస్కర్ విజ్ఞప్తి చేశాడు. "తదుపరి ఐసీసీ సమావేశంలో దయచేసి బౌలర్ల గురించి కూడా ఆలోచించు సౌరవ్. వైడ్ బౌన్సర్ నిబంధనలో వారికి కొంత వెసులుబాటు కల్పించు. ఇది ఆటలో సమతుల్యతను కొద్దిగానైనా పెంచుతుంది" అని స‌న్నీ చెప్పుకొచ్చాడు.

Sunil Gavaskar
Gavaskar
ICC
Sourav Ganguly
Bouncer rule
Cricket rules
Cricket bowlers
T20 cricket
Cricket committee
Wide ball rule

More Telugu News