తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం
- లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఇప్పటికే విచారణ జరిపిన ఏక సభ్య కమిటీ
- ఈ కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు హైలెవెల్ కమిటీని నియమించిన ప్రభుత్వం
- వారంలోగా నివేదిక సమర్పించాలని ఉన్నత స్థాయి కమిటీకి ఆదేశం
తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతతో పాటు ఇతర వివాదస్పద అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఏక సభ్య కమిటీ నివేదికను లోతుగా అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, డీజీపీ, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. నివేదికలోని సాంకేతిక, పరిపాలనాపరమైన, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా సమీక్షించి, బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ మార్గదర్శకాలను రూపొందించనుంది.
ఈ అత్యున్నత స్థాయి కమిటీ తన నివేదికను వారంలోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు అందాయి. లడ్డూ తయారీలో నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జరిగింది, అందుకు గల కారణాలను విశ్లేషించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.