కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. ఈ దాడి అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... తనను పక్కా ప్లాన్ తో హత్య చేసేందుకు యత్నించారని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ కుమ్మక్కయ్యారని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. తనపై జరిగిన దాడి వెనుక వీరిద్దరి వ్యూహం ఉందని, ఈ ఘటనతో వారిద్దరూ ఒక్కటేనని తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై ముందే రెక్కీ నిర్వహించారని, చంపే అవకాశం ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.
బీజేపీ కార్యకర్తలు కర్రలు, కత్తులు, పెట్రో బాంబులతో తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేని పరిస్థితి కరీంనగర్‌లో ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు. పట్టణంలో గన్ కల్చర్‌ను ప్రోత్సహించడం సరికాదని, దొంగతనాలను ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పడమే తాను చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. తాను రెచ్చగొట్టానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.