నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దన్న రేవంత్ రెడ్డి
  • కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపేసి ఇబ్బంది పెట్టవద్దన్న సీఎం
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లకు డీజీపీ సూచన
  • కాన్వాయ్ వెళ్లే సమయంలో సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించాలన్న డీజీపీ
తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో తన పర్యటనల సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. ప్రజలను రోడ్లపై గంటల తరబడి నిలబెట్టవద్దని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళుతున్న క్రమంలో విమానాశ్రయం సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

తాను వెళుతున్న క్రమంలో, ట్రాఫిక్ నిలిపివేయడంతో వాహనాలు పెద్ద ఎత్తున ఆగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని అన్నారు. కాన్వాయ్ వెళ్లే దారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా ఆపేసి ప్రజలను ఇబ్బంది పెట్టడమేమిటని ప్రశ్నించారు. అలా చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు కమిషనర్లతో డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ సమస్యపై ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడుతున్నారని, ఇది సమస్య తీవ్రతను తెలియజేస్తోందని అన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణను పటిష్ఠం చేసేందుకు అడిషనల్ డీజీపీ ఆధ్వర్యంలో త్వరలోనే ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌గా విభజించి వాహనాలను పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ముందు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Revanth Reddy
Telangana CM
Telangana
DGP CV Anand
Traffic Issues
Convoy
Hyderabad Traffic

More Telugu News