జర్మనీలో మహేశ్‌ బాబు... బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక శిక్షణ!

  • ప్రస్తుతం జర్మనీలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్‌ బాబు
  • హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ
  • బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్, ట్రైనింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన మహేశ్‌
  • రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నట్టు అంచనా
  • 2027 ఏప్రిల్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానున్న‌ ‘వారణాసి’
సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తన ఫిట్‌నెస్‌పై ఎంత శ్రద్ధ పెడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 50 ఏళ్ల వయసులో కూడా ఆయన తన అథ్లెటిక్ శరీరాకృతిని కాపాడుకుంటూ యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ప్రముఖ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని మహేశ్‌ బాబు స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.

జర్మనీలోని సుందరమైన బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో పర్యటిస్తున్నట్టు తెలిపిన మహేశ్‌, "ట్రెక్కింగ్... ట్రైనింగ్... రిజువనేటింగ్!!" అనే క్యాప్షన్‌తో రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. ఒక ఫొటోలో పచ్చని అడవులు, జలపాతం నేపథ్యంలో డాక్టర్ హ్యారీతో కలిసి కనిపించారు. మరో ఫొటోలో జిమ్‌లో ఆయనతో పాటు ఉన్నారు. డాక్టర్ హ్యారీ కోనిగ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, లాంగెవిటీ (ఆయుష్షు పెంపు), ప్రెసిషన్ మెడిసిన్ రంగాల్లో నిపుణుడు. మహేశ్‌ బాబు గత కొన్నేళ్లుగా ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. 2023 ఏప్రిల్‌లో కూడా డాక్టర్ హ్యారీ, మహేశ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఆయన ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధను ప్రశంసించారు.

ప్రస్తుతం మహేశ్‌ బాబు తీసుకుంటున్న ఈ కఠిన శిక్షణ, ఆయన లేటెస్ట్ చిత్రం కోసమేనని అభిమాన గణం, సినీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా ‘వారణాసి’ అనే భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2025 నవంబర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లింప్స్‌ను విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. క్రీ.శ. 521 నాటి వారణాసిని చూపిస్తూ ప్రారంభమైన టీజర్, చివర్లో మహేశ్‌ బాబు రుద్రగా త్రిశూలం చేతబట్టి ఎద్దుపై స్వారీ చేస్తున్నట్టు చూపించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రం 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం మహేశ్‌ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా సన్నద్ధమవుతున్నారని, జర్మనీ పర్యటన అందులో భాగమేనని స్పష్టమవుతోంది.

Mahesh Babu
Mahesh Babu fitness
Dr Harry Koenig
Varanasi movie
SS Rajamouli
Black Forest Germany
Priyanka Chopra
Prithviraj Sukumaran
Telugu cinema
Indian cinema

More Telugu News