ఇరాన్ ఆర్థిక మూలాలపై అమెరికా దెబ్బ.. దిగ్బంధనంతో 5 బిలియన్ డాలర్ల నష్టం!

  • గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనంతో ఇరాన్‌కు తీవ్ర ఆర్థిక నష్టం
  • చమురు అమ్మకాల ద్వారా వచ్చే దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయిన ఇరాన్
  • సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో 31 ట్యాంకర్లు సముద్రంలో నిలిచిపోయిన వైనం
  • ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తామని పెంటగాన్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న కఠినమైన దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందాల్సిన దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అంచనా వేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్‌ను మళ్లీ చర్చల వేదికకు తీసుకురావడానికి ఈ ఆర్థిక దిగ్బంధనాన్ని తమ ప్రధాన అస్త్రంగా అమెరికా ఉపయోగిస్తోంది.

అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల‌తో ఏప్రిల్ 13న ఈ దిగ్బంధనం ప్రారంభమైంది. అప్పటి నుంచి చమురు లేదా ఇతర నిషేధిత వస్తువులను రవాణా చేస్తున్నాయనే అనుమానంతో 40కి పైగా నౌకలను దారి మళ్లించినట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. యాక్సియోస్ కథనం ప్రకారం ఈ ఆపరేషన్‌లో భాగంగా రెండు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

సముద్రంలో చిక్కుకున్న 53 మిలియన్ బ్యారెళ్ల చమురు
ప్రస్తుతం గల్ఫ్ జలాల్లో సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో ఉన్న 31 ఇరానియన్ ట్యాంకర్లు చిక్కుకుపోయాయని అధికారులు వెల్లడించారు. దీని విలువ దాదాపు 4.8 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇప్పటికే భూమిపై ఉన్న నిల్వ కేంద్రాలు నిండిపోవడంతో ఇరాన్ పాతబడిన ట్యాంకర్లను తేలియాడే నిల్వ కేంద్రాలుగా (ఫ్లోటింగ్ స్టోరేజ్ యూనిట్లుగా) మార్చింది. అమెరికా నిఘాను తప్పించుకోవడానికి కొన్ని నౌకలు చైనాకు చేరడానికి సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి.

ట్యాంకర్‌ట్రాకర్స్.కామ్ సహ వ్యవస్థాపకుడు సమీర్ మదానీ ఈ పరిస్థితిని విశ్లేషించారు. "HUGE" అనే పేరున్న ఒక ట్యాంకర్ పాకిస్థాన్, భారత తీరాలకు దగ్గరగా ప్రయాణించి, అనంతరం మలక్కా జలసంధి వైపు వెళ్లిందని, అక్కడి నుంచి చమురును చైనాకు వెళ్లే ఇతర నౌకలకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. "ఒత్తిడి ఇలాగే కొనసాగితే, పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో భారీగా నిల్వలను ఏర్పాటు చేసుకుని, ఏదో ఒకరోజు రాత్రికి రాత్రే ఒక్కసారిగా తప్పించుకోవడానికి (గ్రేట్ ఎస్కేప్) ఇరాన్ ప్రయత్నించవచ్చని నేను భావిస్తున్నాను" అని ఆయన యాక్సియోస్‌తో అన్నారు.

ఈ ప్రతిష్టంభన ఇరు దేశాల మధ్య భారీ ఆర్థిక ఘర్షణగా మారింది. హ‌ర్మూజ్ జలసంధిలో ఇరాన్ రాకపోకలను నియంత్రిస్తుంటే, అమెరికా దిగ్బంధనంతో ప్రతిఘటిస్తోంది. మరికొన్ని వారాల్లో ఇరాన్ వద్ద నిల్వ సామర్థ్యం పూర్తిగా అయిపోయి, చమురు ఉత్పత్తిని నిలిపివేయాల్సిన ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. "నిల్వ సామర్థ్యం పూర్తిగా అయిపోవడానికి వారికి కొన్ని వారాలు, లేదా బహుశా ఒక నెల సమయం పట్టవచ్చు" అని యూరేషియా గ్రూప్‌కు చెందిన విశ్లేషకుడు గ్రెగరీ బ్రూ పేర్కొన్నారు.

"ఉగ్రవాదానికి, ప్రాంతీయ అస్థిరతకు నిధులు సమకూర్చే ఇరాన్ ప్రభుత్వ సామర్థ్యంపై మేము విధ్వంసకరమైన దెబ్బ కొడుతున్నాం. ఈ ప్రాంతంలోని మా సాయుధ దళాలు ఈ నిరంతర ఒత్తిడిని కొనసాగిస్తాయి" అని పెంటగాన్ తాత్కాలిక ప్రెస్ సెక్రటరీ జోయెల్ వాల్డెజ్ స్పష్టం చేశారు.

Iran
Iran economy
US sanctions
oil
Gulf of Oman
oil tankers
Donald Trump
Pentagon
oil reserves
Hormuz Strait

More Telugu News