ఆన్‌లైన్ బేరాల వెనుక ఉన్న అసలు రంగు ఇదే!: లావు శ్రీకృష్ణదేవరాయలు

  • ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను హెచ్చరించిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
  • ఆర్మీ, పోలీస్ ఆఫీసర్లమని నమ్మించి మోసం చేస్తున్నారని వెల్లడి
  • వైజాగ్ పోలీసుల అవగాహన వీడియోను షేర్ చేసిన ఎంపీ
  • మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచన
  • ఉచితంగా, తక్కువ ధరలకు వచ్చే వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు
ఆన్‌లైన్ వేదికగా జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎంపీ, లోక్‌సభాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. సెకండ్ హ్యాండ్ వస్తువుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులను ఎలా దోచుకుంటున్నారో వివరిస్తూ ఆయన ఒక కీలకమైన పోస్ట్ చేశారు. వైజాగ్ సిటీ పోలీసులు రూపొందించిన అవగాహన వీడియోను షేర్ చేస్తూ, ఆన్‌లైన్ బేరాల వెనుక ఉన్న ప్రమాదాలను ఆయన ఎత్తిచూపారు.

"ఉచితంగా ఏదీ రాదు, తక్కువ ధరకు అంతకన్నా రాదు" అని గుర్తుంచుకోవాలని శ్రీకృష్ణదేవరాయలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఓఎల్‌ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కొందరు కేటుగాళ్లు తాము ఆర్మీ లేదా పోలీస్ అధికారులమని చెప్పి, నకిలీ ఐడీ కార్డులు చూపిస్తూ నమ్మబలుకుతున్నారని తెలిపారు. తక్కువ ధరకే వస్తువులు అమ్ముతామని చెప్పి, డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారని వివరించారు. ఇలాంటి మోసాల బారిన పడి కష్టార్జితాన్ని కోల్పోవద్దని ఆయన హెచ్చరించారు.

ఒకవేళ పొరపాటున సైబర్ మోసగాళ్ల చేతిలో డబ్బులు కోల్పోతే ఏమాత్రం ఆలస్యం చేయవద్దని ఆయన సూచించారు. మోసపోయినట్టు గ్రహించిన మొదటి గంట అత్యంత కీలకమని, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ '1930'కు ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి, ఇతరులను కూడా కాపాడాలని ఆయన కోరారు.

Lavau Sri Krishna Devarayalu
Online fraud
Cyber crime
OLX fraud
Vizag city police
Cyber crime helpline 1930
Second hand goods
TDP MP
Online scams
Fake ID cards

More Telugu News