ఏటీఎఫ్ ధరల ఎఫెక్ట్.. 100 సర్వీసులను తగ్గించుకోవాలని ఎయిరిండియా నిర్ణయం

  • కొన్ని మార్గాలకు విమానాలను నడపడం భారంగా భావిస్తున్న ఎయిరిండియా
  • ఇంధన వినియోగం అధికంగా ఉన్న యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ సర్వీసులకు కోత
  • లండన్, ప్యారిస్, న్యూయార్క్ నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య తగ్గే అవకాశం
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారంగా మారిన పలు మార్గాలలో విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రోజువారీగా 100 సర్వీసులను తగ్గించుకోనుంది. ఏటీఎఫ్ ధరలు పెరిగినందున కొన్ని మార్గాలకు విమానాలను నడపడం ఆర్థిక భారంగా ఎయిరిండియా భావిస్తోంది.

ఎయిరిండియా రోజుకు సగటున 1,100 సర్వీసులను నడుపుతోంది. ఇంధన వినియోగం అధికంగా ఉండి, మార్జిన్లు అంతగా లేని యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి సుదూర అంతర్జాతీయ మార్గాలలోని సర్వీసులకు ప్రధానంగా కోత పెట్టనుంది. అలాగే, ఢిల్లీ, ముంబై నగరాలకు లండన్, ప్యారిస్, న్యూయార్క్, టొరంటో, శాన్‌ఫ్రాన్సిస్కో, సిడ్నీ, మెల్‌బోర్న్ నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య కూడా తగ్గనుంది.

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వరుసగా రెండో నెల ఏటీఎఫ్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ విమాన సంస్థలకు ఏటీఎఫ్ ధరను 5 శాతం పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ప్రకటనతో ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర ఐదు శాతం పెరిగి, 1,511.86 డాలర్లకు చేరుకుంది. ఇంధన ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయాలు భారంగా మారుతాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Air India
ATF Price Hike
Aviation Turbine Fuel
Flight Services Reduction
Fuel Costs
Airline Industry

More Telugu News