హర్మూజ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది: ఇరాన్ సుప్రీంలీడర్

  • లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేసిన ఇరాన్ సుప్రీం లీడర్
  • దిగ్బంధం కొనసాగుతున్నా, ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను పరిరక్షించుకుంటోందని వెల్లడి
  • పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్ల ఏకైక స్థానం జలాల అడుగున అని చురక
అమెరికా అవమానకర వైఫల్యంతో హర్మూజ్ జలసంధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్, హర్మూజ్ జలసంధి విషయంలో కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఈ మేరకు ఆయన లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేశారు. 

హర్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను పరిరక్షించుకుంటుందని సుప్రీం లీడర్ తెలిపారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్ల ఏకైక స్థానం, ఆ సముద్ర జలాల అడుగున మాత్రమే ఉంటుందని ఎద్దేవా చేశారు. కాగా, ఈ జలసంధి వద్ద కొత్త నియమ నిబంధనలను అమలుచేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొజ్తబా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

అంతకుముందు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ఓడ రేవులపై అమెరికా దిగ్బంధనం గల్ఫ్‌లో చమురు అంతరాయాలను మరింత తీవ్రతరం చేస్తుందని అన్నారు. తద్వారా అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలం కావడం తథ్యమని పేర్కొన్నారు. సముద్ర దిగ్బంధం లేదా ఆంక్షల విధింపు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

Mojtaba Khamenei says new phase taking shape
Mojtaba Khamenei

More Telugu News