అధిక వడ్డీ ఆశ చూపి రూ.6.5 కోట్ల మోసం.. వనస్థలిపురంలో మహిళ అరెస్ట్

  • హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, చిట్టీల పేరుతో భారీ మోసం
  • అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.6.5 కోట్ల వసూలు
  • బడ్డం జ్యోతి అనే మహిళను అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు
  • విచారణలో నేరం ఒప్పుకున్న నిందితురాలు
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, చిట్టీల పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.6.5 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన మహిళను  హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం సీఐ ఎస్. రవిబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడకు చెందిన బడ్డం జ్యోతి (48), గత 9 ఏళ్లుగా వనస్థలిపురం కమలానగర్‌లో నివాసం ఉంటోంది.

జ్యోతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి, పెట్టుబడులపై 10 శాతం వరకు వడ్డీ ఇస్తానని పలువురిని ఆకర్షించింది. దీనితో పాటు పరిచయస్తులతో చిట్టీలు కూడా నడిపించింది. మొదట్లో చెప్పినట్లుగానే లాభాలు, వడ్డీలు చెల్లించడంతో ఆమెను అందరూ నమ్మారు. ఇదే అదనుగా 2020 నుంచి వనస్థలిపురం పరిధిలో సుమారు 10 మంది బాధితుల నుంచి రూ.6.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేయడంతో, మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిన్న రాత్రి నిందితురాలిని అరెస్ట్ చేశారు. విచారణలో మరికొందరి నుంచి కూడా ఇదే విధంగా డబ్బులు వసూలు చేసినట్లు జ్యోతి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ జోన్ డీసీపీ డా.బి. అనురాధ, వనస్థలిపురం ఏసీపీ పి. కాశీరెడ్డి పర్యవేక్షణలో నిందితురాలిని అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవిబాబు వివరించారు.

Vanstalipuram
Hyderabad
woman arrested

More Telugu News