మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ స్కామ్.. ఇన్ఫ్రా సంస్థకు రూ.1.70 కోట్ల టోకరా!
- గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌ను బురిడీ కొట్టించిన బంగారు యాదవ్
- ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేస్తానని నమ్మబలికిన వైనం
- బంగారు యాదవ్ కోసం గాలిస్తున్న పోలీసులు
ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు నానాటికీ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ప్రభుత్వంలోని పెద్దలతో తనకు పరిచయాలు ఉన్నాయని నమ్మించి, ఓ ప్రముఖ ఇన్ఫ్రాటెక్ సంస్థ నుంచి భారీగా వసూలు చేసిన పురిమెట్ల బంగారు యాదవ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, జూబ్లీహిల్స్‌కు చెందిన గ్రీన్ మెట్రో ఇన్ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌ను నిందితుడు బంగారు యాదవ్ కలిశాడు. దుండిగల్ ప్రాంతంలో సదరు సంస్థ చేపట్టాలనుకున్న ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేస్తానని నమ్మబలికాడు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో తనకు క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పి, వివిధ విడతల్లో ఏకంగా రూ.1.70 కోట్ల నగదు, ఒక అల్కజర్ కారు, ఖరీదైన ఐఫోన్‌ను అశోక్ నుంచి నిందితుడు తీసుకున్నాడు.
సుమారు 18 నెలల పాటు ప్రాజెక్టు ఇప్పిస్తానంటూ కాలయాపన చేసిన నిందితుడు, చివరకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.