కిల్లర్ పార్టీతో జాగ్రత్త... శుభ దినాల్లో కూడా తప్పుడు పనులు చేస్తారు: సీఎం చంద్రబాబు

  • రాంబిల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ ఎనర్జీ ప్లాంట్లకు భూమిపూజ
  • అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తామన్న సీఎం
  • విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • నాడు కూల్చివేతలు అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు
అనకాపల్లిలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యర్థి పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఒక పార్టీ నేరాలు, ఘోరాలు చేస్తూ అరాచకాలకు పాల్పడుతోందని, అలాంటి కిల్లర్ పార్టీ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంచి కార్యక్రమాలు, శుభ దినాల్లో కూడా ఇలాంటి దుర్మార్గులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, వారి గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో గురువారం రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థకు చెందిన రెండు ప్లాంట్లకు భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ తీరును, ప్రతిపక్ష నేతల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.

హత్యలు చేసే కిల్లర్ పార్టీ అది

"డబ్బు కోసం, ఆస్తుల కోసం సొంత మనుషుల్ని సైతం కడతేర్చే కిల్లర్ పార్టీ అది. వివేకా హత్య తరహాలోనే కడపలో దస్తగిరి అనే వ్యక్తిని హత్య చేశారు. జగన్ మోహన్ రెడ్డి మేనమామకు ప్రధాన అనుచరుడు, ఆస్తుల కోసం పెద్ద దస్తగిరిని చంపేశాడు. డ్రైవర్‌ను హత్యచేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడు అతనే సాక్షుల్ని బెదిరించే స్థాయికి వచ్చాడు. ఇలాంటి మోసగాళ్లపై మేం నిరంతరం కన్నేసి ఉంచుతాం. 

అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, పెట్టుబడి దారులను తరిమేస్తాం అని బెదిరించే పార్టీలు మనకెందుకు? రాష్ట్రంలో మంచి జరుగుతుంటే ఆ కిల్లర్ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లయినర్లతో కూల్చివేతలు జరిగేవి. నేడు అవే ప్రొక్లయినర్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, వాటిని సంపదగా మార్చే ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలి" అని చంద్రబాబు అన్నారు.

ఉత్తరాంధ్రలో ఇక ప్రతిరోజూ పెట్టుబడుల పండుగే!

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జెడ్ చింతువలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న రెండు ప్లాంట్లకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.4,200 కోట్లతో 6.5 గిగావాట్ల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, రూ.1200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "ఉత్తరాంధ్రలో ప్రతిరోజూ పెట్టుబడుల పండుగే. అనకాపల్లి జిల్లా పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోంది. విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుంది. ఎన్డీఏ బ్రాండ్‌తో ఏపీలో తిరిగి విశ్వాసం వచ్చింది. పారిశ్రామిక వేత్తలకు భరోసా కలిగింది. ఈ నెల 28న 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం," అని వెల్లడించారు.

రెన్యూవబుల్ ఎనర్జీతో జాతి నిర్మాణం

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే కాకుండా, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తితో జాతి నిర్మాణానికి పాటుపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. "ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటికే 90 గిగావాట్ల పనులు ప్రారంభమయ్యాయి. రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రంగంలోకి వచ్చాయి. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఈవీ బస్సులే ఉంటాయి. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి అంటే జాతి నిర్మాణమే" అని సీఎం వివరించారు.

గత ప్రభుత్వ తప్పులను సరి చేస్తున్నాం

గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని, ఆ తప్పులను తాము సరిదిద్దుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. "2019-24 మధ్య పీపీఏలు రద్దు చేసి, అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి వ్యవస్థను నాశనం చేశారు. ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపారు. మేము చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ అమలు చేశాం. రూ.15,795 కోట్ల ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మరోసారి స్పష్టం చేస్తున్నా" అని అన్నారు.

అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధియే లక్ష్యం

రాజధాని అమరావతి నిర్మాణంతో రాష్ట్ర దశ, దిశ మారుతుందని, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి, 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్' నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



Chandrababu
ReNew Energy
Rambilli
Anakapalle
TDP
Andhra Pradesh

More Telugu News