నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

  • రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన
  • రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు
  • ఈ ప్రాజెక్టుల ద్వారా 2,100 మందికి ఉద్యోగ అవ‌కాశాలు
  • రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్టుల నిర్మాణం
సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించ‌నున్నారు. జిల్లాలోని రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబస్ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది.

ఈ పెట్టుబడిలో భాగంగా రెండు కీలక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు. రూ.4,200 కోట్ల వ్యయంతో 6.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యువబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం రానున్న రెండేళ్లలో పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాకతో అనకాపల్లి జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ‌ ఉదయం 9.30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరారు. ఉదయం 11.10 గంటలకు జెడ్. చింతువకు చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.

Chandrababu
Anakapalli district
Renew Energy Globus
Rambilli
Andhra Pradesh
Solar Ingot Wafer
Hybrid Renewable Power Project
Industrial Development
Job Opportunities

More Telugu News