కేరళలో ఘోర విషాదం... బాణసంచా పరిశ్రమలో పేలుడు, 13 మంది మృతి

  • త్రిస్సూర్ పూరం వేడుకల్లో భారీ పేలుడు
  • ఘటనలో 13 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
  • బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
  • అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం, సహాయక చర్యలు ముమ్మరం
  • ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
కేరళలోని ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం వేడుకల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం జరిగిన భారీ పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయ ఉత్సవాల్లో ఒకటైన త్రిస్సూర్ పూరం కోసం బాణసంచా సిద్ధం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగసిపడి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రతి ఏటా మలయాళ నెల 'మాడం'లో పూరం నక్షత్రం రోజున త్రిస్సూర్‌లోని వడక్కునాథన్ ఆలయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద పండుగల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ వేడుకకు పది లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాల్లో బాణసంచా ప్రదర్శన చాలా ప్రత్యేకం. దీనికోసం సిద్ధం చేస్తున్న షెడ్‌లోనే ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులైన వైద్యులను రప్పిస్తామని ఆయన అన్నారు. పోలీస్, ఫైర్, ఆరోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల సమన్వయంతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో 13 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. బాణసంచా నిల్వ, నిర్వహణలో భద్రతా లోపాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ఉత్సవాలపై విషాద ఛాయలు అలుముకున్నాయి.

Kerala Fireworks Blast
Thrissur Pooram
Vadakkunnathan Temple
Thrissur
Kerala

More Telugu News