దక్షిణాదిపై వివక్ష.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి: తమిళనాట కేజ్రీవాల్ గర్జన!
- తమిళనాడులో డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేజ్రీవాల్
- జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్ బిల్లు ఉందన్న కేజ్రీ
- విపక్షాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని వెల్లడి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగుస్తున్న తరుణంలో, డీఎంకే కూటమికి మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఆయన ఎండగట్టారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేజ్రీవాల్ 'ప్రజాస్వామ్యంపై దాడి'గా అభివర్ణించారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు ఉందని, అందుకే తాము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని స్పష్టం చేశారు.
సీఎం స్టాలిన్ తమిళనాడులో అద్భుతమైన పాలన అందిస్తున్నారని, మంచి చేసే వారికి ఎప్పుడూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో బీజేపీకి అసలు ఉనికే లేదని, ఆ పార్టీకి ఓటు వేయవద్దని కోరారు.
ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ చేస్తున్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై స్పందిస్తూ... ప్రస్తుతం తాను తమిళనాడు ప్రచారంలో ఉన్నానని, ఢిల్లీకి తిరిగి వెళ్లాక కోర్టు ఉత్తర్వులను క్షుణ్ణంగా చదువుతానని చెప్పారు. ఇప్పటికే తన వాదనలను కోర్టులో వినిపించానని, తీర్పుపై అంతకుమించి వ్యాఖ్యానించలేనని పేర్కొన్నారు.