దాడి కేసులో మాజీ క్రికెటర్, ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ అరెస్ట్

Yusuf Pathans father in law among three arrested in assault case after road dispute
  • కారుతో నీళ్లు చిందాయన్న కారణంతో మొదలైన వివాదం
  • బాధితుడిపై బేస్‌బాల్ బ్యాట్లు, కర్రలతో దాడి చేసిన నిందితులు
  • పఠాన్ మామ సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
  • నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. మరొకరి కోసం గాలింపు
మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ సహా ఆయన బంధువులు ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కారు వెళ్తున్నప్పుడు గుంతలోని నీళ్లు చిందాయన్న చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బాధితుడిపై బేస్‌బాల్ బ్యాట్లు, కర్రలతో దాడి చేశారన్న ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో యూసుఫ్ ఖాన్ (30) అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా, రోడ్డుపై ఉన్న గుంతలోని నీరు షోయబ్ ఖాన్ అనే వ్యక్తిపై పడింది. దీనికి యూసుఫ్ ఖాన్ వెంటనే కారు ఆపి క్షమాపణ చెప్పాడు. అయినప్పటికీ షోయబ్ దుర్భాషలాడుతూ, కారు అద్దాన్ని కర్రతో పగలగొట్టి దాడి చేశాడు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యూసుఫ్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా, మార్గమధ్యంలో యూసుఫ్ పఠాన్ మామ ఖలీద్ ఖాన్ (మకాలిక్), అతని కుమారుడు ఉమర్సాద్ పఠాన్, షోయబ్ పఠాన్, షెహబాజ్ పఠాన్‌లు వారిని అడ్డగించారు. వెదురు కర్రలు, బేస్‌బాల్ బ్యాట్లతో యూసుఫ్ ఖాన్, అతని కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యూసుఫ్ ఖాన్ సోదరుడి చేయి విరగగా, అతని మేనమామకు తీవ్ర గాయాలయ్యాయి.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఖలీద్ ఖాన్, ఉమర్సాద్ పఠాన్, షోయబ్ పఠాన్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నాలుగో నిందితుడు షెహబాజ్ పఠాన్ కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా, వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Go Back to Shorts
Yusuf Pathan
Father-in-law
Assault Case
Mumbai

More Telugu News