సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

  • సముద్ర తాబేళ్ల సంరక్షణ కోసం రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ ఏర్పాటు
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం
  • చీఫ్ వైల్డ్‌ లైఫ్ వార్డెన్ ఛైర్మన్‌గా ఈ కమిటీ
  • మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలకు కమిటీలో చోటు
ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. వీటి పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఒక రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

గతేడాది డిసెంబర్ 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, అన్ని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తాబేళ్ల సంరక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర అటవీ దళాల అధిపతి (పీసీసీఎఫ్)  సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో ఆర్టీ నెం. 45ను విడుదల చేసింది.

ఈ కమిటీకి రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మత్స్యశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. వీరితో పాటు అటవీ శాఖ, కోస్టల్ సెక్యూరిటీ గ్రూప్, కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ముఖ్యంగా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునేందుకు మెకనైజ్డ్ బోట్ల యజమానుల సంఘం, సంప్రదాయ మత్స్యకార సంఘాల ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించారు.

వీరితో పాటు తాబేళ్ల సంరక్షణలో అనుభవం ఉన్న ట్రీ ఫౌండేషన్, టర్టిల్ యాక్షన్ గ్రూప్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) నుంచి నిపుణులను కూడా సభ్యులుగా నియమించారు. పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించారు.

.

Sea Turtle Conservation
Andhra Pradesh
AP Government
Turtle Action Group
Tree Foundation
Marine Fisheries
Wildlife Institute of India
Coastal Security Group
Fisheries Department

More Telugu News