పుట్టినరోజున సతీసమేతంగా అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు వడ్డన... ఫొటో రౌండప్

Chandrababu serves at Anna Canteen along with wife Nara Bhuvaneswari on his birthday
  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • విజయవాడ పటమటలోని అన్న క్యాంటీన్ కు వెళ్లిన చంద్రబాబు., భువనేశ్వరి
  • అల్పాహారం కోసం వచ్చిన వారికి స్వయంగా వడ్డన 
  • వారితో ఆప్యాంగా మాట్లాడిన ముఖ్యమంత్రి దంపతులు
  • ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదన్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు తన 76వ పుట్టినరోజును పేదల మధ్య నిరాడంబరంగా జరుపుకొన్నారు. విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌ను అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి సందర్శించి, అల్పాహారం కోసం వచ్చిన వారికి స్వయంగా వడ్డించారు. అనంతరం అక్కడి ప్రజలతో కలిసి వారు కూడా అల్పాహారం స్వీకరించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం పేదలపై కడుపుమంటతోనే అన్న క్యాంటీన్లను దుర్మార్గంగా మూసివేసిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్నం పెట్టేవారిపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కేవలం రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందిస్తుండటంతో పేదలు, కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

అన్న క్యాంటీన్లను కేవలం ప్రభుత్వ పథకంగా కాకుండా, ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్నదానంలో భాగస్వాములు కావాలని, ఇందుకు శక్తిమేర విరాళాలు ఇవ్వవచ్చని కోరారు. ఈ స్ఫూర్తికి తన అర్ధాంగి నారా భువనేశ్వరి నాంది పలికారని, తన పుట్టినరోజు కానుకగా రాష్ట్రంలోని అన్ని క్యాంటీన్ల ఒకరోజు నిర్వహణ ఖర్చు కింద రూ.76 లక్షలు విరాళంగా అందించారని తెలిపారు. ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. క్యాంటీన్‌కు వచ్చిన ఆటో డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడిన సీఎం.. భోజనం నాణ్యత, ఇతర ప్రభుత్వ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Birthday
Anna Canteen
TDP
Andhra Pradesh

More Telugu News