డీలిమిటేషన్ ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది: చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ
- ఏపీ తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోతుందన్న షర్మిల
- డీలిమిటేషన్ ను చంద్రబాబు వ్యతిరేకించాలని విన్నపం
- దీనిపై చర్చించేందుకు ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పలుడు చేయాలని సూచన
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారిత పునర్విభజన ప్రక్రియ రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రతిపాదనల వల్ల ఆంధ్రప్రదేశ్ తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోవడమే కాకుండా, వేల కోట్ల రూపాయల ఆర్థిక అవకాశాలను కూడా నష్టపోతుందని షర్మిల హెచ్చరించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు పెద్ద ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా ఏపీకి అన్యాయం చేసే ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా, నిస్సంకోచంగా వ్యతిరేకించాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పార్టీలకతీతంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించారు. పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసేలా అందరినీ ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు అత్యవసరంగా ఒకరోజు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని షర్మిల కోరారు. డీలిమిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, దానిని కేంద్రానికి పంపాలని సూచించారు.
ఇది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదని, భావితరాల భవితను కాపాడే రాజ్యాంగ బాధ్యతని ఆమె గుర్తు చేశారు. కేంద్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా నిలబడాలని ఈ లేఖ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు.