చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..!

హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం తన అత్తమామలు, బామ్మర్ది పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేకే తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చైతన్య రెడ్డి (18), కుమారుడు విశాల్ రెడ్డి (17) చర్లపల్లి-ఘట్‌కేసర్ మధ్య గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై తాజాగా మేడిపల్లి పోలీసులను ఆశ్రయించిన సురేందర్ రెడ్డి.. తన అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, అతని భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. "నా భార్య, పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదు. సొంతవాళ్లే నమ్మించి మోసం చేశారు. ఆస్తి కోసం తీవ్రంగా వేధించి, మానసికంగా కుంగదీసి వారి చావుకు కారణమయ్యారు" అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు చనిపోయిన 25 రోజులకే అత్త, బామ్మర్ది కలిసి తనను ఆస్తి కోసం బెదిరించడం మొదలుపెట్టారని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

భార్యాపిల్లలు చనిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న కేజీన్నర బంగారం, రూ.1.40 కోట్ల నగదును తన అత్త పుష్పలత గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తనను కూడా టార్గెట్ చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఆయన వాపోయారు. తాను కూడా చనిపోతే ఆస్తి మొత్తం వారికే దక్కుతుందనే దురుద్దేశంతో తనను అంతం చేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు ఏమైనా జరిగితే ఆస్తి మొత్తం తన తల్లిదండ్రులకు లేదా ఏదైనా ట్రస్టుకు చెందేలా వీలునామా రాస్తానని, తన కుటుంబాన్ని నాశనం చేసిన వారికి ఒక్క పైసా కూడా దక్కనివ్వనని సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

హైటెక్ సిటీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న విజయశాంతి, దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న సురేందర్ రెడ్డి దంపతులు బోడుప్పల్‌లో నివసించేవారు. జనవరి 30న హాస్టల్‌లో ఉన్న పిల్లలను ఇంటికి తీసుకొచ్చిన విజయశాంతి, అర్ధరాత్రి కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. సురేందర్ రెడ్డి తాజా ఫిర్యాదుతో పోలీసులు ఆస్తి వివాదం కోణంలో ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Vijaya Shanthi Reddy
Charlapalli suicide case
Hyderabad suicide
Software engineer suicide
Property dispute
Family suicide
Surender Reddy
Pushpalatha
Chiranjeevi

More Telugu News