గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో!

రోడ్డు పక్కన తోపుడు బండిపై బంగారు ఆభరణాలు, నాణేలు విక్రయిస్తున్నారు. విశాఖపట్నంలో కనిపించిన ఈ దృశ్యం స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ జ్యువెలరీ సంస్థ చేసిన ఈ వినూత్న మార్కెటింగ్ ప్రయోగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

విశాఖపట్నం బీచ్ రోడ్డులోని సబ్‌మెరైన్ మ్యూజియం ఎదురుగా, అచ్చం ఐస్‌క్రీమ్ బండిలా కనిపించేలా ఓ సెటప్‌ను ఏర్పాటు చేశారు. ‘గోల్డ్‌ ఆన్‌ వీల్స్‌’ పేరుతో ప్రారంభించిన ఈ బండి వద్దకు వచ్చిన వారికి, ఐస్‌క్రీమ్ ఇచ్చినట్లుగా బంగారాన్ని అందిస్తున్నారు. పాత రోజుల్లో రోడ్లపైనే బంగారం అమ్మేవారనే కాన్సెప్ట్‌తో ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ బండిని చూసిన జనం ఆసక్తిగా అక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ బండిపై కేవలం రూ.800కే బంగారు నాణెం అందిస్తుండటం విశేషం. దీనిపై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు కూడా లేవని చెబుతున్నారు. దాంతో చాలామంది ఆసక్తిగా కొనుగోలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఈ బండిపై కేవలం తక్కువ విలువైన బంగారు వస్తువులను మాత్రమే విక్రయానికి ఉంచారు. ఖరీదైన ఆభరణాలన్నీ షోరూమ్‌లలోనే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ నెల 11, 12 తేదీల్లో ఈ బండిని ఏర్పాటు చేయగా, ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో మళ్లీ 18, 19, 20 తేదీల్లో కూడా అందుబాటులో వుంచుతామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ విక్రయాలు జరుపుతున్నారు. కాగా, ఈ బండిపై బంగారం అమ్మకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Gold on Wheels
Visakhapatnam
Vizag beach road
gold coins
gold jewelry
street vending
innovative marketing
Submarine Museum
Andhra Pradesh tourism
low price gold

More Telugu News