ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు... ఈ నెల 20 నాటికి ఫలితాలు!

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. పేపర్ 1 (బీఈ/బీటెక్) ఫలితాలను ఏప్రిల్ 20వ తేదీలోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది.

ఏప్రిల్ 2, 4, 5, 6, 8 తేదీల్లో పేపర్ 1 (బీఈ/బీటెక్), ఏప్రిల్ 7న పేపర్ 2 (బీఆర్క్/బీ-ప్లానింగ్) పరీక్షలు నిర్వహించారు. దేశంలోని 304 నగరాలతో పాటు, విదేశాల్లోని 14 నగరాల్లో కలిపి మొత్తం 566 కేంద్రాల్లో ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో జరిపారు. ఈ సెషన్‌కు దాదాపు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ 1కు 93 శాతం, పేపర్ 2కు 73 శాతం హాజరు నమోదైనట్లు ఎన్టీఏ వెల్లడించింది.

ఫలితాల ప్రకటనకు ముందు, ఏప్రిల్ 9న విద్యార్థులు రాసిన ప్రశ్నాపత్రాలను, ఏప్రిల్ 11న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే, ఒక్కో ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించి సవాలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. జనవరిలో జరిగిన సెషన్ 1, ఏప్రిల్‌లో జరిగిన సెషన్ 2 పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ఆల్ ఇండియా ర్యాంకులను కేటాయిస్తారు.
 

JEE Main
JEE Main 2024
NTA
National Testing Agency
Engineering Entrance Exam
JEE Results
JEE Answer Key
JEE Cutoff
B.E B.Tech
JEE Exam Date

More Telugu News