సొంత పార్టీ 'బీఆర్‌పీ'ని స్థాపిస్తున్నా: సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ప్రకటన

పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, కాంగ్రెస్ బహిష్కృత నాయకురాలు, మాజీ టీమిండియా క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ తెరదించుతూ కొత్త పార్టీ పెడుతున్నట్టు ఆమె అనౌన్స్ చేశారు.


ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన ఇదని తెలుపుతూ, భారతీయ రాష్ట్రవాది పార్టీ (బీఆర్‌పీ)ని స్థాపిస్తున్నట్లు ఆమె ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ నాయకుల పనితీరును సమీక్షించిన తర్వాత, ప్రజలకు ఒక కొత్త ప్రత్యామ్నాయం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.


తన కొత్త పార్టీ ప్రధానంగా ప్రజాసేవ, న్యాయంపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రజలకు నిజంగా ఏం కావాలో దానిని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. పంజాబ్ కోల్పోయిన కీర్తిని, గౌరవాన్ని తిరిగి తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా మార్చడమే తన ఆశయమని వెల్లడించారు. ప్రేమ, స్వేచ్ఛ, నిస్వార్థ సేవ వంటి విలువల ఆధారంగా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు.


పౌరుల్లో ఆధ్యాత్మిక వికాసాన్ని పెంపొందించడం, సత్యం, ప్రేమ మార్గంలో నడవడం వంటి ఉన్నత ఆశయాలను ఆమె తన సందేశంలో ప్రస్తావించారు. గాయపడిన ప్రజల మనసులను నయం చేసే ఉద్యమంగా దీనిని అభివర్ణించారు. అయితే, ఈ ప్రకటనలో పార్టీ నిర్మాణం, ఇతర నాయకులు ఎవరు ఉంటారు, అధికారికంగా పార్టీని ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు.

పంజాబ్‌లో ఇప్పటికే ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, బీజేపీల మధ్య చతుర్ముఖ పోటీ ఉండగా... సిద్ధూ దంపతుల కొత్త అడుగు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


Navjot Kaur Sidhu
Punjab politics
Bharatiya Rashtravadi Party
BRP party
Navjot Singh Sidhu
Punjab political party
AAP Congress
Shiromani Akali Dal
BJP
Punjab elections

More Telugu News