Kalvakuntla Kavitha: బంజారా నేతలతో కల్వకుంట్ల కవిత భేటీ.. తన పార్టీకి అండగా ఉండాలని విన్నపం
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతూ, ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అన్ని వర్గాల మద్దతు కూడగట్టే పనిలో భాగంగా, ఈరోజు ఆమె హైదరాబాద్‌లో బంజారా సామాజిక వర్గ ప్రముఖులతో భేటీ అయ్యారు.
రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసానికి వెళ్లిన కవిత... ఆయనతో పాటు పలువురు బంజారా ప్రముఖులతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తన కొత్త రాజకీయ ప్రయాణానికి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఆమె వారిని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మంత్రివర్గంలో బంజారాలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయమని ఆమె పేర్కొన్నారు.
తమ పార్టీలో బంజారాలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నామని కవిత అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతను, నేతలను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కవిత పిలుపునిచ్చారు.