Karnataka Government: పరువు హత్యలకు చెక్.. ప్రేమ జంటలకు రక్షణగా కర్ణాటక సంచలన బిల్లు!

పరువు హత్యలకు అడ్డుకట్ట వేస్తూ, ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. కులం, మతం పేరుతో జరిగే దాడుల నుంచి ప్రేమికులను కాపాడేందుకు ఉద్దేశించిన ‘కర్ణాటక వివాహ ఎంపిక స్వేచ్ఛ, గౌరవం పేరిట జరిగే నేరాల నిరోధక బిల్లు-2026’కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ బిల్లు ప్రకారం.. తమకు ప్రాణహాని ఉందని భావించే ప్రేమ జంటలు పోలీసులను ఆశ్రయిస్తే, ఫిర్యాదు అందిన 6 గంటల్లోనే వారికి రక్షణ కల్పించాలి. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సేఫ్ హౌస్‌’లను ఏర్పాటు చేయనుంది. బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ తో పాటు, 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తేనుంది.

పరువు పేరుతో దాడులకు పాల్పడటం, సామాజిక బహిష్కరణ విధించడం వంటి చర్యలను ప్రభుత్వం ఈ బిల్లులో తీవ్రమైన నేరంగా పేర్కొంది. నేరం రుజువైతే, నిందితులకు కనిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్ష నుంచి గరిష్టంగా మరణశిక్ష వరకు విధించేలా కఠిన నిబంధనలు చేర్చింది. 18 ఏళ్లు నిండిన యువతి, 21 ఏళ్లు నిండిన యువకుడు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే, తల్లిదండ్రులు లేదా కుల పెద్దల అనుమతి అవసరంలేదని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది.

12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవన్న చెప్పిన ‘ఇవా నమ్మవ’ (అతడు మనవాడే) అనే వచనం స్ఫూర్తితో ఈ బిల్లుకు పేరు పెట్టడం విశేషం. కులమతాలకు అతీతంగా మానవత్వానికే పెద్దపీట వేయాలనే సందేశాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. దేశంలో పరువు హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Karnataka Government
Honor Killings
Love Couples Protection
Karnataka Bill 2026
Marriage Choice Freedom
Basavanna
Safe House
Inter Caste Marriage
Inter Religious Marriage
Crime Prevention Bill

More Telugu News