: గత ప్రభుత్వంలో నన్ను కొట్టారు.. పుట్టుకను తిట్టారు: ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్

గత ప్రభుత్వ హయాంలో శాసనమండలిలో జరిగిన మూడు రాజధానుల బిల్లు చర్చ సందర్భంగా తనపై తీవ్ర దౌర్జన్యం జరిగిందని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి మంత్రుల్లో ఒకరు తనపై చేయి చేసుకోగా, మరొకరు తన పుట్టుకను ప్రశ్నిస్తూ దారుణంగా దూషించారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ చట్టం చేయడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన సంబరాల్లో షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాటి పరిణామాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

మూడు రాజధానుల బిల్లు శాసనమండలికి వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు తనను చుట్టుముట్టి, సిబ్బందిని కూడా దగ్గరికి రానీయకుండా అడ్డుకున్నారని షరీఫ్ తెలిపారు. సభ్యులు కుర్చీలు, బెంచీలు ఎక్కి, టేబుళ్లపై కూర్చొని తనను తీవ్రంగా బెదిరించారని ఆరోపించారు. "నాకు డబ్బు లేదని, బతుకుదెరువు చూపిస్తామని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో చివరికి శాసనమండలినే రద్దు చేస్తామని హెచ్చరించారు. అయినా నేను నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదు. నమాజ్ చేసుకుని, అల్లాను ప్రార్థించి సత్యం వైపే నిలబడ్డాను" అని షరీఫ్ వివరించారు.

శాసనమండలి ఛైర్మన్‌గా తనకు ఉన్న విచక్షణాధికారంతో ఎంత ఒత్తిడి వచ్చినా ధర్మాన్ని వీడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చుని ఉన్నారని, అమరావతిపై ఆయన తపన వృథా కాకూడదనే చిత్తశుద్ధితోనే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ నిర్ణయం తర్వాత తనను ఛైర్మన్ పదవి నుంచి దించేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తనపై నమ్మకంతో ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మండలి ఛైర్మన్‌గా అవకాశం కల్పించారని, ఆ నమ్మకాన్ని, రుణం తీర్చుకునే అవకాశం మూడు రాజధానుల బిల్లు రూపంలో వచ్చిందని షరీఫ్ అన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మండలిలో తీవ్ర గందరగోళం మధ్య షరీఫ్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపగా, ఆ తర్వాత మండలి రద్దు తీర్మానం వరకు పరిణామాలు వెళ్లిన విషయం తెలిసిందే.

More Telugu News