Raja Raghuvanshi: హనీమూన్ హత్యకేసు.. 'రాజా రఘువంశీ' మళ్లీ పుట్టాడు!

గతేడాది మేఘాలయలో హనీమూన్‌లో ఉండగా భార్య చేతిలోనే దారుణ హత్యకు గురైన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ కేసులో తాజాగా ఒక భావోద్వేగ పరిణామం చోటుచేసుకుంది. రాజా తన కుటుంబంలోనే పునర్జన్మించాడని ఆయన కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. వారి కుటుంబంలో ఇటీవల జన్మించిన ఓ మగ శిశువును ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ హత్య కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా వీసావ్ డాంగ్ జలపాతం వద్ద 2025 మే 23న రాజాను గొడ్డలితో నరికి చంపారు. కొన్ని రోజుల గాలింపు తర్వాత జూన్ 2న ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో రాజా భార్య సోనం (25), ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా (25) సహా ఐదుగురిని నిందితులుగా చేర్చి మేఘాలయ పోలీసులు సెప్టెంబర్ 2025లో 790 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు.

ఇలాంటి పరిస్థితుల నడుమ, రాజా కుటుంబంలో ఆదివారం ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ శిశువుకు 'రాజా' అని పేరు పెట్టారు. రాజా అన్నయ్య సచిన్ మాట్లాడుతూ.. "రాజా చంద్ర పక్షం 11వ రోజున మధ్యాహ్నం 2:40 గంటలకు మరణించగా, ఈ బిడ్డ అదే రోజున మధ్యాహ్నం 2:42 గంటలకు జన్మించాడు" అని తెలిపారు. తన తమ్ముడి మరణానంతరం కామాఖ్య ఆలయ పూజారి, రాజా మళ్లీ ఇదే కుటుంబంలో పుడతాడని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

"నెలల తరబడి దుఃఖంలో ఉన్న మా కుటుంబానికి రాజా పుట్టుక కొంత ఊరటనిచ్చింది" అని రాజా తల్లి ఉమా రఘువంశీ అన్నారు. "మేము అతన్ని ‘రాజా’ అని పిలిచినప్పుడు, అతడు మమ్మల్ని ముందే గుర్తుపట్టినట్లుగా చూస్తున్నాడు" అని ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామంతో విషాదంలో ఉన్న తమ కుటుంబంలో కాస్త ఆనందం వెల్లివిరిసిందని వారు తెలిపారు.
Raja Raghuvanshi
Meghalaya murder case
honeymoon murder
Sonam Raghuvanshi
reincarnation
East Khasi Hills
Veesaw Dong waterfall
Indore businessman
Raj Kushwaha
Kamakhya Temple

More Telugu News