మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 12 మంది సజీవ దహనం కావడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు వెంటనే ఏపీ సీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
ఇవాళ‌ ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ఒక క్వారీ సమీపంలో టిప్పర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లోనూ భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో బస్సు, టిప్పర్ రెండూ పూర్తిగా దగ్ధమయ్యాయి. 12 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

టీపీసీసీ అధ్యక్షుడి సంతాపం
ఈ ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై, ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




More Telugu News