రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ చేతులు మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,725 కోట్లు) కొనుగోలు చేసినట్లు వెల్లడైంది.

ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్‌లతో పాటు బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంస్థలు ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఆర్సీబీ ఫ్రాంచైజీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్)తో ఈ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్‌లో ఐపీఎల్ పురుషుల జట్టుతో పాటు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మహిళల జట్టు కూడా ఉన్నాయి.

కొత్త యాజమాన్యంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అయితే, ఈ కొనుగోలుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ పాలకమండలుల నుంచి అధికారిక అనుమతులు లభించాల్సి ఉంది.

కొన్ని నెలల క్రితం ఆర్సీబీ మాతృసంస్థ డయాజియో పీఎల్‌సీ ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టింది. కాగా, ఒకే సమయంలో ఐపీఎల్ (2025), డబ్ల్యూపీఎల్ (2026) టైటిళ్లను గెలుచుకున్న ఏకైక ఫ్రాంచైజీగా ఆర్సీబీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో విజయ్ మాల్యా ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోగా, యునైటెడ్ స్పిరిట్స్ సంస్థను డయాజియో టేకోవర్ చేయడంతో ఆర్సీబీ యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి.


More Telugu News